Diwali 2025: భారత్‌తో పాటు దీపావళి జరుపుకునే 9 దేశాలు ఇవే!

దీపావళి పండుగను మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోనూ అంగరంగవైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా భారతీయ సంతతి ప్రజలు అధికంగా ఉన్న ఈ తొమ్మిది దేశాలలో దీపావళి పండుగ సంబరాలు ఘనంగా వివిధ రకాల పేర్లతో చేసుకుంటారు.

New Update
Diwali

దీపాల పండుగ దీపావళి అంటే భారతీయులందరికీ ఎంతో స్పెషల్. అయితే, ఈ పండుగను మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోనూ అంగరంగవైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా భారతీయ సంతతి ప్రజలు అధికంగా ఉన్న ఈ తొమ్మిది దేశాలలో దీపావళి పండుగ సంబరాలు ఘనంగా వివిధ రకాల పేర్లతో చేసుకుంటారు.

నేపాల్: మన పొరుగు దేశమైన నేపాల్‌లో దీపావళిని 'తిహార్' అనే పేరుతో ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఇక్కడ లక్ష్మీపూజతో పాటు కుక్కలు, ఆవులు వంటి జంతువులను పూజించడం ఈ పండుగ ప్రత్యేకత.

శ్రీలంక: ఇక్కడి తమిళ హిందూ కమ్యూనిటీ ప్రజలు దీపావళిని జరుపుకుంటారు. దీపాలు వెలిగించి, దేవాలయాలను సందర్శించి, కొత్త బట్టలు ధరించి సంతోషంగా గడుపుతారు. ఇది శ్రీలంకలో అధికారిక సెలవు దినం కూడా.

మలేషియా: మలేషియాలో దీపావళిని 'హరి దీపావళి' అని పిలుస్తారు. ఇక్కడ దీపావళి రోజున ప్రజలు నూనె స్నానం చేసి, ఆలయాలకు వెళ్తారు. ఈ పండుగ దేశంలో జాతీయ సెలవు దినంగా ఉంది.

సింగపూర్: బహుళ సంస్కృతుల దేశమైన సింగపూర్‌లో దీపావళి సందర్భంగా 'లిటిల్ ఇండియా' ప్రాంతం దీపకాంతులతో మెరిసిపోతుంది. ఇక్కడ కూడా దీపావళి అధికారిక సెలవు దినమే.

మారిషస్: హిందూ జనాభా అధికంగా ఉన్న మారిషస్‌లో దీపావళి ఒక జాతీయ పండుగ. ఇళ్లంతా దీపాలతో అలంకరించి, సాంప్రదాయ పిండివంటలు తయారు చేస్తారు.

ఫిజీ: సౌత్ పసిఫిక్ దీవుల్లోని ఫిజీలో దీపావళిని పెద్ద ఎత్తున జరుపుకుంటారు. నూతన వస్త్రాలు, స్వీట్ల మార్పిడి, రంగురంగుల దీపాల అలంకరణలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇది కూడా జాతీయ సెలవు దినం.

గయానా: దక్షిణ అమెరికాలోని ఈ దేశంలో భారతీయ సంస్కృతి ఎక్కువగా ఉంది. ఇక్కడ దీపావళికి నేషనల్ పబ్లిక్ హాలీడే కూడా ఉంటుంది. ప్రార్థనలు, దీపాలు వెలిగించి, పండుగ భోజనంతో జరుపుకుంటారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో: కరేబియన్ దీవుల్లోని ఈ దేశంలో దీపావళిని అతి పెద్ద సాంస్కృతిక ఉత్సవంగా భావిస్తారు. ఇక్కడ 'దివాలి నగర్' వేడుకలు చాలా ప్రసిద్ధి.

మయన్మార్: ఇక్కడి భారతీయ సమాజం దీపావళిని సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం భక్తిశ్రద్ధలతో జరుపుకుంటుంది. ఇళ్లను అలంకరించి, దీపాలు వెలిగించి, స్వీట్లు పంచుకుంటారు.

ఈ విధంగా, దీపావళి పండుగ కేవలం భారతదేశానికే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వెలుగులు పంచుతూ, ఆశ, విజయం, ఐకమత్యాన్ని చాటుతోంది.

Advertisment
తాజా కథనాలు