/rtv/media/media_files/2026/03/04/summer-2026-03-04-19-30-03.jpg)
మార్చి నెల వచ్చేసింది. అప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి కాలం వచ్చిదంటే వాతావరణంతో పాటు మన శరీరం కూడా విపరీతమైన వేడికి గురవుతోంది. దీంతో మన శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం తద్వారా వడదెబ్బ, నీరసం వంటి సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇలాంటి సమయంలో మన బాడీని కూల్ గా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. కేవలం నీళ్లు తాగడమే కాకుండా, మన ఆహారంలో కొన్ని రకాల పండ్లను తినడం చాలా మంచిది.
92 శాతం నీరే ఉండటం
వేసవిలో మనకు పుచ్చకాయ అందుబాటులో ఉంటుంది. ఇందులో దాదాపు 92 శాతం నీరే ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన తేమను ఇది పుష్కలంగా అందిస్తుంది. పుచ్చకాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా శరీరాన్ని లోపల నుండి చల్లబరుస్తాయి. అలాగే దానిమ్మ పండు కూడా వేసవిలో ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య రాదు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో దానిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే దానిమ్మ రసం తీసుకోవడం మంచిది.
రోజూవారీ ఆహారంలో నారింజ పండ్లను చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని విటమిన్-సి శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చి నీరసాన్ని తగ్గిస్తుంది. ఇక పులుపు, తీపి కలిసుండే ద్రాక్ష పండ్లు వేసవికి చాలా మంచివి. వీటిలో 70 శాతానికి పైగా నీటి శాతం ఉండటం వల్ల ఎండల వల్ల వచ్చే అలసటను ఇవి తగ్గిస్తాయి. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గానీ, సాయంత్రం స్నాక్స్ లాగా గానీ తినవచ్చు .
జీర్ణవ్యవస్థను శుభ్రపరచడమే
ఈ లిస్టులోకి దోసకాయను కూడా చేర్చుకోండి. ఇది శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్లను అందించి వేడిని తగ్గిస్తుంది. అలాగే పండిన పప్పాయ జీర్ణవ్యవస్థను శుభ్రపరచడమే కాకుండా శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. వీటన్నింటితో పాటు ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోయి, సహజ సిద్ధమైన చల్లదనం లభిస్తుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో కేవలం కూల్ డ్రింక్స్‌పై ఆధారపడకుండా, ఇలాంటి ప్రకృతి సిద్ధమైన పండ్లను తింటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Follow Us