/rtv/media/media_files/2025/08/26/veg-vs-non-veg-diet-2025-08-26-18-28-52.jpg)
Veg vs non-veg diet
Veg vs Non-Veg Diet: ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ.. అనేకమంది వ్యక్తులు సంప్రదాయ ఆహారపు అలవాట్లను విడిచిపెట్టి శాకాహారం (Vegetarian) మరియు వీగన్ జీవనశైలిని అవలంబిస్తున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, సినీ నటులు అమితాబ్ బచ్చన్, జెనీలియా డిసౌజా వంటి ప్రముఖులు సైతం ఈ ఆహార విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఈ డైట్ పాటించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. వాటి వల్ల ఏమైనా పోషక లోపాలు సంభవిస్తాయా అనే సందేహాలపై ఫ్రాన్స్‌కు చెందిన ఒక ప్రముఖ సంస్థ లోతైన పరిశోధన చేసింది.ఫ్రెంచ్ ఏజెన్సీ ఫర్ ఫుడ్, ఎన్విరాన్‌మెంటల్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్ & సేఫ్టీ (ANSES) అనే ప్రభుత్వ సంస్థ ఈ అంశంపై విస్తృత పరిశోధన చేసి.. దాని ఫలితాలను నివేదిక రూపంలో విడుదల చేసింది. వాటి గురించి కొని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తక్కువ ప్రమాదం..
ఈ నివేదికలో శాకాహారం మరియు వీగన్ డైట్ వల్ల కలిగే ప్రయోజనాలు, సంభావ్య ప్రమాదాలు, మరియు పోషకాహార లోపాలపై స్పష్టంగా వివరించారు. శాకాహారం అంటే కేవలం జంతు మాంసం, చేపలు, సముద్ర ఉత్పత్తులను తినకపోవడం. అయితే ఇందులో గుడ్లు, పాల ఉత్పత్తులు తినేవారిని లాక్టో-ఓవో వెజిటేరియన్లు అని, జంతు సంబంధిత ఆహారాన్ని పూర్తిగా విడిచిపెట్టేవారిని వీగన్లు అని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ పరిశోధనలో శాకాహారం పాటించేవారికి కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తక్కువ ప్రమాదం ఉంటుందని తేలింది. ముఖ్యంగా మాంసాహారులతో పోలిస్తే శాకాహారులకు టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉందని వెల్లడైంది. అంతేకాకుండా.. ఇస్కిమిక్ గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, అలాగే కొన్ని కంటి, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో స్పష్టమైంది.
ఇది కూడా చదవండి: జ్యూసులు తాగుతున్నారా.? అయితే జాగ్రత్త!!
మరోవైపు ఈ డైట్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. శాకాహారం ముఖ్యంగా కఠినమైన వీగన్ డైట్ పాటించేవారిలో ఎముకల పగుళ్లు (Bone Fractures) మరియు హైపోస్పాడియాస్ (hypospadias - పురుషులలో పుట్టుకతో వచ్చే యురేత్రా సమస్య) వంటివి సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. పోషకాహార విలువలను పరిశీలిస్తే.. శాకాహారులు ముఖ్యమైన పోషకాలైన ఐరన్, అయోడిన్, విటమిన్ B12, D, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి వాటి లోపంతో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా వారిలో కాల్షియం, ఫాస్పరస్ సమతుల్యత కూడా నాన్-వెజిటేరియన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుందని తేలింది. ఈ లోపాలను సరిదిద్దడానికి.. శాకాహారులు పప్పులు, నూనె గింజలు, పాల ఉత్పత్తులు వంటివి ఎక్కువగా తీసుకోవాలని.. అవసరమైతే సప్లిమెంట్లను వాడాలని కూడా ఈ అధ్యయనం సూచించింది. ఈ నివేదిక శాకాహార జీవనశైలిని అనుసరించాలనుకునేవారికి ఒక సమగ్ర మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఓవర్ టైం వర్క్‌తో ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలో తెలియటం లేదా..? ఈ చిట్కాలతో పని ఒత్తిడి పరార్!!