/rtv/media/media_files/2025/09/06/balapur-ganesh-laddu-2025-09-06-09-39-06.jpg)
Balapur Ganesh Laddu
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ నిమజ్జన ఉత్సవాల సమయంలో వినాయకుడి లడ్డూని వేలం వేస్తారు. వేలంలో లడ్డూ కొనడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో వేలంలో లడ్డూ కొనడం అనే దాన్ని ఒక సంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో బాలాపూర్ లడ్డూ భారీ ధరలకు పలుకుతోంది. నిమజ్జనం అంటే హైదరాబాద్ నగరం చూపు అంతా బాలాపూర్‌పైనే. అయితే వేలంలో లడ్డూ కొనడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
అదృష్టం, ఐశ్వర్యం
గణపతిని విఘ్నాలకు అధిపతిగా, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడిగా పూజిస్తారు. గణపతికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూను వేలంలో గెలుచుకోవడం ద్వారా ఆయన ఆశీస్సులు, అదృష్టం తమకు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ క్రమంలోనే లడ్డూ వేలంలో కొంటారు. అయితే హైదరాబాద్‌లో బాలాపూర్ గణేశ్ లడ్డూకు చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ లడ్డూ గెలిచిన వారు తర్వాత కాలంలో వ్యాపారంలో, వృత్తిలో, వ్యవసాయంలో బాగా అభివృద్ధి చెందారని నమ్ముతారు. ఈ క్రమంలోనే తరతరాల నుంచి ఈ వేలం పాట కొనసాగుతోంది.
సామాజిక గౌరవం, గుర్తింపు
ప్రసిద్ధ గణపతి లడ్డూను వేలంలో ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయడం వల్ల సమాజంలో ఒక ప్రత్యేక గౌరవం, గుర్తింపు లభిస్తాయని నమ్ముతారు. ఇది తమ దానశీలతను, భక్తిని, సంపదను చాటుకోవడానికి ఒక మార్గంగా భావిస్తారు. లడ్డూ వేలంలో పాల్గొన్న వ్యక్తులు సమాజంలో గొప్ప స్థానంలో ఉంటారని నమ్ముతారు.
పుణ్యం, దాతృత్వం
లడ్డూ వేలంలో వచ్చిన డబ్బును సాధారణంగా గణేశ్ ఉత్సవాల నిర్వహణకు, సామాజిక కార్యక్రమాలకు, దేవాలయాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. ఈ లడ్డూను కొనుగోలు చేయడం ద్వారా తనకి తెలియకుండానే ఒక మంచి పనికి సాయం చేసినట్లు అవుతారు. దీంతో వారికి పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు.
అన్నింట్లో విజయం, లాభం
వేలంలో లడ్డూ కొనుగోలు చేయడం వల్ల అన్నింట్లో విజయం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. వ్యాపారాల్లో అభివృద్ధి చెంది లాభాలు రావాలని కోరుకుని వేలం వేస్తారు. అలాగే తాము చేపట్టిన అన్ని పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతాయని పండితులు చెబుతున్నారు. కొందరు ఈ లడ్డూను అందరికీ పంచి పెడతారు. మరికొందరు ఇళ్లు లేదా ఆఫీసులో ఉంచుకుంటారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.