Health Tips In Telugu: ఈ లక్షణాలు మీకూ ఉన్నాయా?.. డెంగ్యూ ఫీవర్ కావచ్చు!

వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక జ్వరం, తీవ్రమైన కండరాల, కీళ్ల నొప్పులు, కంటి వెనుక నొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

New Update
Dengue Fever Symptoms

Dengue Fever Symptoms

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దోమల బెడద పెరుగుతోంది. దీంతో ఈ సీజన్‌లో ఎక్కువగా జలుబు, ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా డెంగ్యూతో(Dengue Fever Symptoms) జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ డెంగ్యూ అనేది ‘ఏడెస్ ఈజిప్టి’ అనే దోమ కుట్టడం వల్ల వస్తుంది. అందువల్ల దీని లక్షణాలు ఎలా ఉంటాయి. డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.  

dengue fever symptoms

డెంగ్యూ సోకిన తర్వాత 4 నుంచి 7 రోజుల్లో దాని లక్షణాలు కనిపిస్తాయి. డెంగ్యూలో ప్రధాన లక్షణం అధిక జ్వరం. ఇది 104°F (40°C) ఫారెన్‌హీట్ వరకు జ్వరం రావొచ్చు. దీంతో పాటు విపరీతమైన తలనొప్పి వస్తుంది. ముఖ్యంగా నుదిటి భాగంలో తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. 

కంటి వెనుక భాగంలో నొప్పి ఉంటుంది. కళ్లను కదిలించినప్పుడు లేదా నొక్కినప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. 

కండరాలు, కీళ్ల నొప్పులు కూడా ఉంటాయి. శరీరం, చేతులు, కాళ్లు, నడుము భాగంలో తీవ్రమైన కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. దీనినే ‘‘ఎముకలు విరిగిన జ్వరం’’ (Breakbone fever) అని కూడా అంటారు.

కొందరిలో శరీరంపై దద్దుర్లు లేదా ఎర్రటి మచ్చలు వంటివి కనిపిస్తాయి. 
మరికొందరికి వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. 

తీవ్రమైన డెంగ్యూ అయితే చిగుళ్ళ నుంచి లేదా ముక్కు నుంచి రక్తం కారడం, రక్తస్రావం కావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

శరీరంలో శక్తి పూర్తిగా తగ్గిపోయి, నీరసంగా ఉంటుంది.

అయితే కొన్ని సందర్భాల్లో డెంగ్యూ తీవ్రమైన రూపంలోకి మారుతుంది. దీనిని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటారు. ఈ దశలో ప్రాణాలకు ప్రమాదం ఉండవచ్చు. అకస్మాత్తుగా తీవ్రమైన పొత్తికడుపు నొప్పి, నిరంతర వాంతులు, చిగుళ్ళు లేదా ముక్కు నుంచి రక్తస్రావం, వాంతులు లేదా మలంలో రక్తం, చర్మం కింద రక్తస్రావం, వేగంగా శ్వాస తీసుకోవడం 

ఈ తీవ్రమైన సంకేతాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. డెంగ్యూను నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి తీవ్రమై ప్రాణాలకే ప్రమాదం అని నిపుణులు సూచిస్తున్నారు.

తీసుకోవలసిన జాగ్రత్తలు

నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం: డెంగ్యూ దోమలు ఎక్కువగా నిల్వ ఉన్న నీటిలోనే పెరుగుతాయి. అందువల్ల ఇంటి పరిసరాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లు, ఫ్రిజ్ వెనుక ట్రేలు వంటి వాటిలో నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. వీటిని కనీసం వారానికి ఒకసారి క్లీన్ చేయాలి.

పరిశుభ్రత: ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను రోజూ దూరంగా తీసుకెళ్లి బయటపడేయాలి. దోమలు గుడ్లు పెట్టడానికి అనుకూలంగా ఉండే ఏ ప్రదేశాన్నీ ఉంచకూడదు.

దోమతెరలు: రాత్రి పూట పడుకునేటప్పుడు దోమతెరలు వాడటం చాలా మంచిది. ఇది దోమల నుండి రక్షణ కల్పిస్తుంది. అలాగే దోమలను తరిమికొట్టే స్ప్రేలు, క్రీములు, దోమలు రాకుండా చేసే యంత్రాలు ఉపయోగించాలి.

పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు: సాయంత్రం వేళల్లో బయటకు వెళ్ళినప్పుడు లేదా పడుకున్నపుడు పూర్తిగా చేతులు, కాళ్లను కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.

కిటికీలు/ తలుపులు: సాయంత్రం చీకటి పడిన తర్వాత కిటికీలు, తలుపులు మూసి ఉంచడం మంచిది.

Advertisment
తాజా కథనాలు