Health Benefits Of Sitting : ఈ రోజుల్లో బిజీ లైఫ్ (Busy Life) వల్ల చాలా తక్కువ మందికి హాయిగా కింద కూర్చొని తిండి తినడానికి సమయం దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఆహారాన్ని ప్యాక్ చేసి తమతో తీసుకెళ్లి సమయం దొరికినప్పుడల్లా తింటారు. లేదా ఇంట్లో డైనింగ్ టేబుల్, సోఫా, బెడ్ మీద తింటూ ఉంటారు. మరి కొంత మంది టీవీ లేదా ఫోన్‌లో చూస్తూ సోఫాలో తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. పూర్వకాలంలో అందరు నేల పై కూర్చొని మాత్రమే భోజనం చేసేవారు. ఇది ఒక సంప్రదాయం మాత్రమే కాదు దీనికి వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే నేల పై కూర్చొని (Sitting) భోజనం చేయాలని చెబుతారు. అయితే నేల పై కూర్చొని భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
బరువు తగ్గించడంలో సహాయపడుతుంది
కూర్చోవడం వల్ల శరీర కదలిక పెరుగుతుంది. ఇది కడుపు త్వరగా నిండిన అనుభూతిని కలిగిస్తుంది. నేలపై తినడానికి కూర్చున్నప్పుడు, వీపును నిటారుగా ఉంచాలి. బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఈ పద్ధతిని అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది. నేల పై కూర్చొని భోజనం చేయడం ద్వారా మనసును రిలాక్స్ గా ఉంచడంతో పాటు అతిగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది. అంతే కాదు అలసట , శరీర బలహీనతను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
అజీర్ణంలో సహాయపడుతుంది
కాళ్లు నేలకు ఆనించి కూర్చోవడం జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్లేట్‌ను నేల పై ఉంచి, తినడానికి శరీరాన్ని ముందుకు వంచడం ద్వారా కడుపు కండరాలు చురుకుగా ఉంటాయి. దీని వల్ల కడుపులో యాసిడ్ స్రావం పెరిగి ఆహారం వేగంగా జీర్ణమవుతుంది.
రక్త ప్రసరణ పెరుగుతుంది
కింద కూర్చొని భోజనం చేయడం ద్వారా శరీరంలో రక్త ప్రవాహం (Blood Flow) పెరుగుతుంది. ఇది నరాలను ప్రశాంతపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నేలపై కూర్చున్నప్పుడు, మన శరీరం, గుండెపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. సుఖాసనంలో కూర్చున్నప్పుడు రక్తం శరీరమంతా సమానంగా ప్రవహిస్తుంది.
మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది
పద్మాసనం, సుఖాసనం ధ్యానానికి ఉత్తమమైన భంగిమలు. ఇవి మనసులోని ఒత్తిడిని దూరం చేయడంలో చాలా మేలు చేస్తాయి. శ్వాస వ్యాయామాలు చేయడానికి ఇది ఒక అద్భుతమైన భంగిమ. ఇది శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది. వెన్నెముకను నిఠారుగా చేస్తుంది. అలాగే భుజం కండరాలను సడలిస్తుంది.