ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి ఫస్ట్ అడిషనల్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కోర్ట్ జడ్జీ (Sangareddy District )శుక్రవారం రోజు సంచలన తీర్పును వెలువరించారు. కేసులో నిందితులుగా ఉన్న ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మహిళలతో కలిపి మొత్తం 9మందికి జీవిత ఖైదు విధంగారు. 2016 ఏప్రిల్ 25వ తారీఖున సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని జహీరాబాద్ మండల పరిధిలో ఉన్న కాశీపూర్ (Kashipur) గ్రామంలో నర్సమ్మ( Narsamma) అనే మహిళ హత్యకు గురైంది. తన తల్లి హత్య అనంతరం నర్సమ్మ కుమారుడు శివ ఈ 9మందిపై చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ (Chirag Pally Police Station) లో కంప్లైయిట్ చేశాడు.
పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం...దోషులైన 9మంది కూడా తమ కుటుంబ సభ్యురాలైన ఒక మైనర్ బాలికకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లికి గంటల ముందు పోలీస్, మహిళా సంక్షేమ శాఖ కాశీపూర్ వచ్చి మైనర్ బాలికకు పెళ్లి చేయడం నేరమని పెళ్లిని ఆపేశారు. అయితే పెళ్లికి సంబంధించి పోలీసులకు సమాచారం అందించిన నర్సమ్మ ( Narsamma)నే అని ఆమె పై కక్ష్య పెంచుకున్నారు. అప్పటికే భర్త చనిపోయి కొడుకుతోపాటు జహీరాబాద్ పట్టణంలో నివసిస్తున్న నర్సమ్మ ఏప్రిల్ 25 వ తేదీన వితంతు పెన్షన్ కోసం కాశీపూర్ గ్రామానికి వచ్చింది. ఇదే అదునుగా భావించిన దోషులు వీరన్న, వడ్ల ప్రభు, ప్రశాంత్, సంతోష్, వెంకట్, రేఖ, ఈశ్వరమ్మ, శ్రీకాంత్, నర్సమ్మపై కట్టెలతో దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలైన నర్సమ్మ అక్కడిక్కడే మరణించింది.
కోర్టు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత జడ్జి గన్నరపు సుదర్శన్ ఈరోజు తీర్పును వెలువరించారు. 9మందిని దోషులుగా తేల్చారు. వారందరికీ జీవితఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ. 5వేల జరిమానా విధించారు. జరిమాన చెల్లించని క్రమంలో మరో ఏడాది సాధారణ జైలు శిక్షతోపాటు రూ. 500జరిమానా విధించాలని కోర్టు పేర్కొంది.
కాగా జిల్లాఎస్పీ చెన్నూరి రూపేష్ (SP Chennuri Rupesh) ఈ తీర్పుపై స్పందించారు. నిందితులకు శిక్షపడేలా చేసిన పోలీసు అధికారులు సీహెచ్ రాజశేఖర్ , ఎస్సై ఇన్వేస్టిగేషన్ అధికారులు ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, ఎస్సై నరేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె. శ్రీనివాస్ రెడ్డి, కోర్టు డ్యూటీ ఆఫీసర్ తోపాటు పలువురు అధికారులను అభినందించారు. నేరస్తులకు న్యాయస్ధానం (court) ముందు శిక్షపడినప్పుడే ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని ఎస్పీ అన్నారు.