బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ఏకంగా ప్రధాని షేక్ హసీనా నివాసంలోకి ఆందోళనకారులు చొరబడ్డారు. గేట్లు బద్దలు కొట్టి ప్రధాని నివాసంలోకి వెళ్లి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ ఘటనకు ముందే షేక్ హసీనా.. ప్రధాని పదవికి రాజీనామా చేసి ప్రత్యేక హెలీకాప్టర్‌లో దేశాన్ని విడిచి పారిపోయారు. అయితే ఆమె భారత్‌లోని త్రిపుర రాజధాని అగర్తలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హసీనా తండ్రి, బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ ముజీబుర్ రెహ్మన్ విగ్రహాలు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు ఈ ఆందోళనల్లో 300 మందికి పైగా మృతి చెందారు.
Also Read: కోటి మంది బీహార్ ప్రజలు కొత్త పార్టీని ప్రారంభిస్తారు: ప్రశాంత్ కిషోర్
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో సైనిక పాలన విధించే దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా.. 1971లో బంగ్లాదేశ్ పాకిస్థాన్‌తో పోరాడి స్వాతంత్య్రం సాధించుకుంది. దీంతో స్వాతంత్య పోరాట యోధులకు, వారి వారసులకు 30 శాతం రిజర్వేషన్‌ను కేటాయిస్తూ 1972లో అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2018లో ఈ రిజర్వేషన్‌ను షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది. కొంతమంది దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. స్వాతంత్ర్య పొరాట యోధుల వారసులకు మళ్లీ 30 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ తీర్పునిచ్చింది. దీని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనలు చేపట్టారు.
ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో.. చివరికి అత్యున్నత న్యాయస్థానం ఈ రిజర్వేషన్‌ను 5 శాతానికి తగ్గించింది. ఇతర వర్గాలకు మరో 2 శాతం రిజర్వ్ చేసింది. మిగతా 93 శాతం మెరీట్ ఆధారంగా కోటాను కేటాయించింది. ఆందోళనలు ఆపేయాలని విద్యార్థులకు సూచించింది. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ హింసాత్మక ఘటనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని.. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు.
Also Read: ప్రయాణికురాలి తలలో పేలు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్