Bathukamma: గౌరమ్మను తల్లి గంగమ్మ ఒడిలో వదిలేసే సద్దుల బతుకమ్మ

తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఇప్పటికే ఎనిమిది రోజులు ముగిసాయి. ఈరోజు తొమ్మిదో రోజు, సద్దుల బతుకమ్మ జరుపుకునే రోజు. మరి ఈ రోజు ప్రత్యేకతలేంటో, ఎలా జరుపుకుంటారో చూద్దామా.

New Update
Bathukamma: గౌరమ్మను తల్లి గంగమ్మ ఒడిలో వదిలేసే సద్దుల బతుకమ్మ

Bathukamma 2023: తెలంగాణ... సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. తెలంగాణ జానపదులకు.. మట్టివాసనలకు అద్దం పట్టే బతుకమ్మ.పువ్వులను అమ్మవార్లుగా తలచి పూజించే బతుకమ్మ. తొమ్మిది రోజులు.. తొమ్మిది అమ్మవార్లు.. రోజొక్క ప్రసాదం.. ఇక చివరి రోజున సద్దుల బతుకమ్మకు సత్తువ ముద్దలు చేయడం ఆనవాయితి.

ప్రారంభం రోజు ఎంగిలి పూల బతుకమ్మ నుంచి చివరి రోజు సద్దుల బతుకమ్మ వరుకు నువ్వన్నం.. కొబ్బరన్నం.. వేపకాయలు… అటుకులు, బెల్లం.. వెన్న ముద్దలు.. మలీద ముద్దలు, సత్తు ముద్దలు ఇలా రోజుకో నైవేద్యం పెడతారు. మక్కలు, బియ్యం, పల్లీలు, నువ్వులను కలిపి సత్తు ముద్దలను చేస్తారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సత్తు ముద్దలను బతుకమ్మకు నైవేద్యంగా ఆర్పిస్తారు.

Also Read: కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. తెలంగాణ నిండైన బతుకమ్మను తలపిస్తోందన్న సీఎం

ఈరోజు తొమ్మిది అంతరలుగా పేర్చిన సద్దుల బతుకమ్మ (Bathukamma) చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. రంగురంగుల పూలతో సంబరమంతా తనదే అన్నట్టు ఉంటుంది. బతుకమ్మకు పోటీగా ప్రతి ఇంటి ఆడబిడ్డ ఎంతో అందంగా తయారయ్యి చెట్టులో పువ్వంత హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉంటారు.ఇదంతా ఒక ఎత్తు అయితే సద్దుల బతుకమ్మ సాయంత్రం ఒక ఎత్తు. ఆ రోజే బతుకమ్మ ముగింపు. బతుకమ్మ మీద కొలువైన గౌరమ్మను ఆ తల్లి గంగమ్మ ఒడిలో వదిలిపెట్టి మళ్ళీ ఏడాది వరకు బతుకమ్మ కోసం ఎదురుచూస్తారు.

సాయంత్రం ఆడపిల్లలు, ఆడవారు అందరూ ఇంతెత్తున పేర్చిన బతుకమ్మను తీసుకుని వీధి కూడలిలో చేరి పెద్ద పెద్ద బతుకమ్మల చుట్టూ చేరి గుండ్రంగా తిరుగుతూ, జానపద పాటలు పాడతారు, ఆడతారు.చీకటి పడేవరకు ఆడి పాడి, ఆ తరువాత బతుకమ్మలను ఎత్తుకుని ఊరేగుతూ వెళ్ళి బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఆ తరువాత రొట్టె, చెక్కెరతో తయారు చేసిన నైవేద్యం ను అందరికి పంచి తాము తిని, ఇంటికి వెళ్లి ఇంటిల్లిపాదికి పంచిపెడతారు. దాంతో సద్దుల బతుకమ్మతో పాటు బతుకమ్మ పండుగ ముగుస్తుంది.

తొమ్మిదిరోజు బతుకమ్మలు వదిలిన నీటి ప్రాంతాలన్నీ పూలతో నిండిపోయి కొత్త చీర కట్టుకున్న గంగమ్మలా కనువిందు చేస్తాయి. ప్రతీ ఇంటిలోనూ అందరి ముఖాలు కళకళలాడతాయి. ఆనందం వెల్లివిరుస్తుంది.

Also Read: వెయిట్ లాస్ కోసం టేస్టీ స్మూతీలు…

Advertisment
Advertisment
తాజా కథనాలు