ఉయ్యూరులోని కాటూరు రోడ్డులోని ఉన్న శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థలో కేంద్ర అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యాసంస్థల్లో అక్రమంగా నిషేధిత థాయిలాండ్‌కు చెందిన నత్తల పెంపకాన్ని గుట్టురట్టు చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఘటనపై రాష్ట్ర అధికారులపై కేంద్ర అధికారులు మండిపడ్డారు. దేశంలో నిషేధిత నత్తలను ఏపీలోని ఉయ్యూరులో ఓ వ్యక్తి పెంచడం కలకలం సృష్టిస్తోంది. థాయ్‌లాండ్ నత్తలు చాలా ప్రమాదకరమని, ఒక్కోటి దాదాపు 50 సెంట్ల పొలంలోని పంటను నాశనం చేయగలదని వ్యవసాయ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నత్తలను ఉయ్యూరులోని శ్రీవిశ్వశాంతి విద్యాసంస్థల చైర్మన్ కుమారుడు మాదాల చంద్రశేఖర్ పెంచుతున్నారు.
అసలు విషయం వెలుగులోకి
థాయ్‌లాండ్ నుంచి వాటిని తెప్పించి విద్యాసంస్థల ఆవరణలోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పెంచుతున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను యూట్యూబ్ ఛానెల్‌లో అప్ లోడ్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఆ వీడియో చూసిన బయాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థల ఆవరణలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రత్యేకంగా ట్యాంకుల్లో పెంచుతున్న నత్తలను, పెంపకం పద్ధతులను రెవెన్యూ, అగ్రికల్చర్, టాస్క్‌ఫోర్స్ అధికారులు పరిశీలించారు. ఈ నత్తలను చైనా వంటి దేశాల్లో ఎక్కువగా తింటారు. అమెరికాలో అయితే వైద్యానికి ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నత్తలను ఏపీలో ఓ వ్యక్తి ఇష్టంగా పెంచుకుంటున్నాడు. అందులోనూ భారత్‌లో నిషేధించిన థాయ్‌లాండ్ నత్తలను తీసుకొచ్చి మరీ పెంచుతున్నాడు.
ఎలా వచ్చాయని ఆరా..?
అందులోని నత్తలు నిషేధిత జాబితాలోనివి కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. థాయిలాండ్‌లో కొనుగోలు చేసినట్లుగా బిల్లులు చూపించాలని అధికారులు కోరారు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో థాయ్‌లాండ్ నుంచి వాటిని తీసుకువచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రమాదకరమైన ఈ నత్తలను దేశంలోకి ఎలా తీసుకువచ్చారు? సెక్యూరిటీ తనిఖీల నుంచి ఎలా తప్పించుకున్నారు? అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నత్తలను ఎందుకు పెంచుతున్నారు? ఏ దేశానికి ఎగుమతి చేస్తారు..? అనే అంశంపై కూడా అధికారులు విచారిస్తున్నారు. అయితే.. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఏపీలో రైతుల పరిస్థితి చాలా బాధాకరం: మాజీ మంత్రి అఖిలప్రియ