నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే టికెట్ వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పెట్టిన బిక్షతోనే తాను కాజకీయాల్లోకి వచ్చానన్న ఆయన.. గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసినట్లు ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల మనోభావాలను పార్టీ అధిష్టానం గుర్తించాలన్నారు. ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా తాను స్వాగతిస్తానన్న ఆయన.. వారికి తనకుంటే ఎక్కువ స్థానం కల్పించినా తాను కట్టుబడి ఉంటానని, వారికి గౌరవం ఇస్తానన్నారు. నర్సాపూర్ టికెట్ మాత్రం తనకే కేటాయించాలన్నారు.
కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్సీ పదవి నుంచి మంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తనకు ఫర్యాలేదన్న ఆయన.. తాను మాత్రం ఎమ్మెల్యే సీటును వదులుకోలేని స్పష్టం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని స్థానిక ప్రజా ప్రతినిధులు తనకే మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యే సీటు ఇస్తే నియోజకవర్గంలో పార్టీ ముక్కలయ్యే అవకాశం ఉందన్నారు. కాగా సీఎం కేసీఆర్ ఇటీవల బీఆర్‌ఎస్ అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించింది.
బీఆర్ఎస్ ప్రకటించిన మొదటి జాబితాలో మెజార్టీ స్థానాల్లో సిట్టింగులకే స్థానం కల్పించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే కొత్త వారికి టికెట్ ఇచ్చారు. కాగా మరో నాలుగు అసెంబ్లీ స్థానాలను ఆయన పెండింగ్‌లో పెట్టారు. పెండింగ్‌లో జనగామా, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి స్థానాలున్నాయి. ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం కోసం సీఎ కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తాను మాత్రం నర్సాపూర్ టికెట్‌ను వదులుకోనని ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్పష్టం చేశారు.