Chiranjeevi: కేరళ రాష్ట్రం వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా అందరి మనసులను కలచివేస్తోంది. ఈ ప్రకృతి విపత్తులో వందల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పై పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. ప్రకృతి విపత్తులో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలెబ్రెటీలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు.
వయనాడ్ బాధితులకు మెగాస్టార్ కోటి విరాళం
తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన వంతు సహాయాన్ని అందించారు. ఆయన కుమారుడు రామ్ చరణ్, తాను కలిసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కోటి రూపాయలు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసంలో వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యాను. వయనాడ్ దుర్ఘటన బాధితులకు నా ప్రగాఢ సానుభూతుని తెలుపుతున్నాను. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నేను చరణ్ కలిసి కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి విరాళంగా అందజేస్తున్నాం. బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు.
Also Read: Allu Arjun: వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ సాయం.. రూ. 25 లక్షల విరాళం - Rtvlive.com