కామారెడ్డి ప్రజలు సీఎం కేసీఆర్‌కు బ్రహ్మరథం పడుతారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్ నేతలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కే ఓటు వేస్తామని మాచారెడ్డి మండల పరిధిలోని గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు బీఆర్ఎస్ నేతలు కవితకు తెలిపారు. దీనికి సంబంధించి తీర్మాన పత్రాలను కవితకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. ఎమ్మెల్యే గంపా గోవర్దన్‌ను అభినందించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్యకర్తలు వచ్చి ఏకగ్రీవ తీర్మనాలు చేసి, వాటిని తనకు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీచేబోతున్నారని కవిత తెలిపారు.
రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. సీఎం కామారెడ్డికి రావడం వల్ల కేవలం కామారెడ్డికే కాకుండా ఉమ్మడి నిజామాబాద్‌తో పాటు పొరుగున ఉన్న నాలుగైదు జిల్లాలు అభివృద్ధి పథంలో మరింత ముందకు సాగుతాయని స్పష్టం చేశారు. నిజామాబాద్ బిడ్డగా సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పొటీ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నాని కవిత తెలిపారు. కారుకు ఎదురు లేకుండా సాగిపోయే విధంగా ఈ 10 గ్రామాల ప్రజలు ఉత్సాహాన్ని ఇచ్చారని వెల్లడించారు. ఇదే ఉత్సాహం ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు ఉండాలని ఎమ్మెల్సీ ఆకాంక్షించారు.
పార్టీలకు అతీతంగా మాచారెడ్డి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే అనేక గ్రామాలు బీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని తీర్మానాలు చేస్తున్నట్లు కవిత తెలిపారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.