ఇస్తాంబుల్‌ను డల్లాస్ చేస్తామన్న కేసీఆర్(kcr).. హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థను కూడా బాగు చేయించలేకపోయారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని అంబర్ పేట, పటేల్ నగర్, ప్రేమ్ నగర్, ముసారంబాగ్ బ్రిడ్జి (Musarambagh Bridge) ప్రాంతాల్లో పాదయాత్రగా వెళ్లిన ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ముంపు ప్రాంత ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని ప్రభుత్వం అందిస్తున్న సహాయ సౌకర్యాలపై ఆరా తీశారు. వరద బాధితులు తమ సమస్యలను ఎంపీ వద్దకు తీసుకెళ్లగా.. ఆయన బాధితుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్(Hyderabad)లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిల్లలను బయట తిరగనీయకూడదని, తడిసిన విద్యుత్ స్థంభాలను పట్టుకోవద్దని సూచించారు. నీటి ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతం వైపు వెళ్లకూడదని పాత భవనంలో నివాసం ఉంటున్న వారు త్వరగా ఖాళీ చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ (ghmc) అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి(Kishan Reddy).. హైదరాబాద్‌లో ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో విఫలమయ్యారన్నారు. వరదల్లో హైదరాబాద్ నానుతున్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
కేసీఆర్ (cm kcr) ప్రగతి భవన్ వదిలి రావడం లేదని విమర్శించారు. ప్రగతి భవన్(Pragati Bhavan)ను వరద ముంచితే సీఎంకు వరద బాధితుల సమస్యలు అర్థమౌతాయన్నారు. ప్రస్తుతం మూసీ (musi) ఉధృతంగా ప్రవహిస్తోందని, దీంతో ముసారంబాగ్ బ్రిడ్జి వద్ద వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉందని తెలిపారు. యూసుఫ్ గూడ(Yusuf Guda)లో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని బస్తీలో చిన్న వర్షం పడ్డా డ్రైనేజీ పొంగిపొర్లుతోండటంతో బస్తీ వాసులు నరకం చూస్తున్నారని, దుర్వాసన భరించలేక పోతున్నారన్నారు. స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) వరద ప్రభావిత ప్రాంతాలను ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం అభివృద్ధి కోసం హైటెక్ సిటీ(Hi-tech city), మాదాపూర్‌లకు డబ్బులను ఖర్చు చేస్తోంది కానీ ముంపు ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం మాత్రం చూపలేకపోతోందన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ (Hyderabad) పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాటలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదని ఆ మాటలను చేతలుగా మార్చాలని కిషన్ రెడ్డి సూచించారు.