MLC Kavitha Over Bhatti Vikramarka Issue: సీఎం రేవంత్ యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టిగారిని, మంత్రి కొండ సురేఖను అవమానించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎత్తైన పీటలమీద కూర్చొని భట్టిని తక్కువ ఎత్తులో కూర్చోబెట్టడం చాలా దౌర్భాగ్యం అన్నారు. సీఎం రేవంత్ వెంటనే భట్టితోపాటు తెలంగాణ ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
చాలా ఓపిక పట్టినం..
ఈ మేరకు కవిత మాట్లాడుతూ.. గతంలో అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్ కు వినతిపత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడుకి వినతిపత్రం ఇచ్చారంటూ రేవంత్ అవమానించారని గుర్తు చేస్తూ తనదైన స్టైల్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అప్పుడు ఓపిక పట్టినం. ఇవాళ సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దళితుడు అయిన భట్టిని రేవంత్ అవమానించారు. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. మహిళకు 47 శాతం రిజర్వేషన్లతో ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ అబద్ధాలు చెప్పారు. గురుకులాల్లో 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ గారు జీఓ ఇచ్చారు. దాన్ని కాంగ్రెస్ వాళ్లు తీసేసారు. సీఎం చెప్పేవాన్ని అన్ని అబద్ధాలే. యువతను మభ్యపెట్టాలని చూస్తున్నారు. విద్యార్థులను మోసం చేయొద్దు. బీసీ లకు మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలి. అందుకే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. కులగణన విషయంలో కాలయాపన చేయొద్దు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలకంటే ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి' అంటూ కవిత చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Lemon Auction: రూ.35 వేలు పలికిన నిమ్మకాయ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
అసలేం జరిగిందంటే..
సోమవారం యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) విషయంలో సీఎం రేవంత్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. పూజ సమయంలో రేవంత్, ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి, సురేఖ పీటలపై ఆసీనులవగా భట్టి మాత్రం పీటపై కాకుండా నేలపై కూర్చోవడంపై చర్చనీయాంశమైంది. దీంతో దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రికి, మహిళా మంత్రికి దేవుడి సాక్షిగా అవమానం జరిగిందంటూ పలువురు నెటిజన్లు విమర్శలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చిన్న పీట వేసి.. సీఎం దంపతులు, మిగతా మంత్రులు పెద్ద పీటల్లో కూర్చోవడం బాధకరమంటూ మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్, బాల్క సుమన్ (Balka Suman) లు దేవుడి సాక్షిగా ఉపముఖ్యమంత్రికి ఘోర అవమానం జరిగిందంటూ తమదైన స్టైల్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.