ఈ నెల 22న అయోధ్య(Ayodhya)లో రామలయ ప్రాణప్రతిష్టఅత్యంత వైభవంగా సాగనుంది. దీనికోసం రామభక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రామజన్మభూమితోపాటు అక్కడ ప్రసిద్ధి చెందిన మరో భవనం గురించి కూడా ఇప్పుడు చర్చ సాగుతుంది. అదే కనక్ భవన్ (Kanak Bhawan) ఇది సీతారాముల వ్యక్తిగత భవనం. అయోధ్య నగరానికి ఈశాన్యంలో ఈ భవనం ఉంది. ఈ భవంతిని సీతాదేవి అయోధ్య కోడలుగా వచ్చిన సందర్భంగా ఆమె చిన్న అత్త కైకేయి బహుమతిగా ఇచ్చారని భక్తులు నమ్ముతారు. ఈ భవనం భక్తికి, ,చరిత్రకు, సీతారాముల ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్నది.
బంగారు మందిరం
కనక్‌భవన్‌ను బంగారు భవంతి లేదా సోనే కా ఘర్ అని కూడా పిలుస్తారు. దీనికి కారణమేంటంటే ఇందులో మూడు బంగారు కిరీటాలతో కూడిన రాముడు, సీతాదేవిల విగ్రహాలు వెండి పైకప్పుకింద ఉన్నాయి. వీటిలో అతిపెద్ద విగ్రహం పేరు కనక్ బిహారీ, మధ్యతరహా విగ్రహం మనక్ బిహారీ, చిన్న విగ్రహానికి జుగల్ బిహారీ అని పిలుస్తారు. కనక్‌భవన్‌లో సీతారాముల విగ్రహాలను ద్వాపరయుగంలో రాముని కుమారుడు కుషుడు ప్రతిష్టించాడని చెబుతారు. దీన్ని విక్రమాదిత్యుడు పునర్నిర్మించడానికి ముందు మట్టిదిబ్బపై శ్రీకృష్ణుడు మరొకజత దేవత విగ్రహాలను ప్రతిష్ఠించారంటారు. అందుకే ఈ ఆలయంలో మూడు జతల ప్రతిష్టిత విగ్రహాలు కనిపిస్తాయి.
విశ్వకర్మ పర్యవేక్షణలో
రాముడి తండ్రి దశరథరాజు కోరిక మేరకు విశ్వకర్మ పర్యవేక్షణలో ఈ ప్రదేశంలో స్వర్ణపు భవనం నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఇది సీతారాముల వ్యక్తిగత భవనంగా పేర్కొంటారు. అందుకే ఈ భవనంలోకి మగవారికి అనుమతి ఉండేదికాదు. రామభక్తుడు హనుమంతుడు కూడా ఈ నియమాన్ని పాటించాడని చెబుతారు. తర్వాతి కాలంలో ఈ భవనాన్ని విక్రమాదిత్యుడు మరమ్మతులు చేయించాడు. ఆ తర్వాత క్రీ.శ. 1891లో ఓర్చా మహారాణి వృషాభాను కున్వారి పునరుద్ధరించారు. కున్వారి మధ్యప్రదేశ్ లోని టికామ్ ఘడ్ ప్రాంతానికి చెందిన రాణి. సీతారాముల మీదా ఉన్న భక్తితో ఆలయ పునర్నిర్మాణానికి అంకితభావంతో కృషి చేసిందని చెబుతారు.
ముస్లిం కార్మికులచే పునర్నిర్మాణం
చాలాకాలంగా ఈ భవనం ఓర్చా రాజవంశీకుల నిర్వహణలో ఉంది. ఈ భవనం గోడల నుంచి కాలి పట్టీల మువ్వల శబ్దం వినిపిస్తుందని స్థానికులు చెబుతారు. ఈ భవనానికి సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మొత్తం భవనం ముస్లిం కార్మికులచే పునర్నిర్మాణం కావటం. ఈ భవనాన్ని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. ప్రతిరోజు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వివిధ పండుగలు, పర్వదినాల్లో విగ్రహాలను అందంగా అలంకరిస్తారు.