కాళేశ్వరం ఇంజనీర్‌ కేసీఆరే.. కేసీఆర్‌ రాత్రి పూట డిజైన్‌ చేసి చెక్‌ డ్యాంలకు ప్లాన్‌ గీశారు: భట్టి విక్రమార్క

సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రైతులు వరదల వల్ల సర్వం కోల్పోయి నడి రోడ్డున పడితే.. కేసీఆర్‌ మాత్రం వారి మంత్రులతో బీసీ బంధు చెక్కులను పంపిణీ చేయించుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.

Bhatti Vikramarka: త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
New Update

సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వర్షాలు, పకృతి వైపరిత్యాలు మన చేతిలో లేనప్పటికీ వాటిని ముందే పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం ఉందన్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రైతాంగం తీవ్ర నష్టాన్నిచవి చూసిందని, వర్షాల వల్ల జరిగిన నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. 2014 తర్వాత రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులు కేసీఆర్ సాంకేతికతతో కాకుండా రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం కట్టుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంజనీర్‌ కేసీఆరే అన్న భట్టి.. కేసీఆర్‌ రాత్రి పూట డిజైన్‌ చేసి మూడు చెక్‌ డ్యామ్‌లకు ప్లాన్‌ గీశారని ఆరోపించారు.

అడ్డగోలుగా చెక్‌ డ్యామ్‌లు నిర్మించడం వల్లే రాష్ట్రంలో రైతులను, ప్రజలకు భారీ స్థాయిలో నష్టం జరుగుతోందన్నారు. కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రాలకు ప్రత్యేక విమానాలు పంపి, ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులను తెలంగాణకు రప్పించుకొని కండువాలు కప్పుతున్నారు కానీ.. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులో ఉన్నారని తెలిసి కూడా ఒక్క హెలికాఫ్టర్‌ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అనాలోచిత డిజైన్‌ల వల్ల ప్రజలు నీటిలో నానుతున్నారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ముంపు గ్రామాల్లో ప్రజలు నీటిలో నానుతున్నా పట్టించుకోని సీఎం.. తన మంత్రులతో బీసీ బందు చెక్కులను పంపిణీ చేయించుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులను పంపించి వరద నష్టంపై అంచనా వేయాలన్నారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణమే సహాయం కింద మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున అందించాలని భట్టి డిమాండ్‌ చేశారు. ప్రజలను మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్న భట్టి.. కేసీఆర్‌ హిందువులు దైవంగా భావించే రాముడ్ని సైతం మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడ్ని మోసం చేసిన కేసీఆర్‌ను గద్దె దించాలని రాముడిని మొక్కినట్లు వెల్లడించారు.

సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకుంటూ తెలంగాణను అప్పుల పాలు చేస్తున్నారని విమర్శించారు. గత 9 సంవత్సరాల్లో హైదరాబాద్‌ మాత్రమే అభివృద్ధి చెందిందని ఇతర ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదని భట్టి ఆరోపించారు. ప్రజలు కేసీఆర్‌ మోసాలను గమనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్‌కు తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు.

#brs #congress #bhatti-vikramarka #cm-kcr #helicopter #varadalu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి