Kadapa: కడపలో చెత్త పన్నుపై రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి (MLA Madhavi Reddy), మేయర్ సురేష్ బాబు (Mayor Suresh Babu) మధ్య చెత్త పన్నుపై వార్ నడుస్తోంది. చెత్త పన్ను రద్దుపై జీవో ఉందని ఒకవైపు ఎమ్మెల్యే మాధవి అంటుండగా.. ఏలాంటి జీవో లేదని మేయర్ సురేష్ బాబు అన్నారు. చెత్త పన్ను వసూలు చెయ్యవద్దని జీవో ఉంటే చూపించాలని మేయర్ సురేష్ బాబు ప్రశ్నించారు.
నగరంలో మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవీ మధ్య చెత్త పన్ను వసూలుపై మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే మాధవి రెడ్డి చేసిన వ్యాఖ్యలను మేయర్ ఖండించారు. చెత్త పన్నుపై ఎమ్మెల్యే మాధవి రెడ్డి అనవసర రాద్దాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు. కేవలం ప్రభుత్వం నోటి మాటతో చెత్త పన్ను రద్దు అని చెప్పిందని..అయితే, ఇంత వరకు ఎటువంటి అధికారిక జీవో ఇవ్వలేదని మేయర్ స్పష్టం చేశారు.
Also Read: గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు.. సర్కార్ ఆలోచన ఇదే!
ప్రస్తుతం కడప నగరపాలక సంస్థ పాలకవర్గం వైసీపీదే నని.. క్లీన్ కడప లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. మురికి వాడల్లో రూ. 30 , గృహాలకు రూ. 40, కమర్షియల్ దుకాణాలకు రూ. 90 చెత్త సేకరణకు వసూలు చేయాలని తీర్మానం చేశామన్నారు. 100 చెత్త ఆటోల ద్వారా 200 మంది సిబ్బందితో చెత్తను ఎప్పటికప్పుడు ఎత్తేస్తున్నామని తెలిపారు. కోట్ల రూపాయల ఖర్చుతో చెత్తను తీసి వేయిస్తున్నాని.. కానీ చెత్త ద్వారా వచ్చే రాబడి కేవలం రూ. 25 లక్షలు మాత్రమేనని అన్నారు.
90 ఆటోలలో కేవలం 20 ఆటోలను తొలగించామన్నారు. నగరపాలక సంస్థకు వచ్చే ఆదాయం, ఖర్చులను కూడా చూడాలన్నారు. మూడు నెలల నుంచి కడపలో ఎక్కడా చెత్తకు పన్ను ఇవ్వడం లేదని.. వాటిని సేకరించే సిబ్బందికి జీతం ఎవరు ఇవ్వాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? లేక నగరపాలక సంస్థ ఇవ్వాలా అనేది ఇంత వరకు స్పష్టం చేయలేదన్నారు. రూ. 2.50 కోట్లు నెలకు చెత్త ఎత్తే వాహనాలు, సిబ్బందికి ఖర్చు అవుతుందన్నారు. రూ. 75 కోట్లు సంవత్సరానికి నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని.. హుందాతనంగా ఎమ్మెల్యే వ్యవహరించాలన్నారు.