ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కడపలోని కో-పరేటివ్ కాలనీలో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తను సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. కడప నగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా వెంకటేశ్వర్లు పనిచేస్తున్నాడు. రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు నిన్న రాత్రి తుపాకీతో ఇంటికొచ్చాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అర్ధరాత్రి సమయంలో తన కుటుంబాన్ని కాల్చి చంపి.. తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒక్కసారిగా అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తుపాకీతో ఇంటికి వచ్చాడు
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప నగరంలోని ఎన్జీవో కాలనీలో రైటర్ వెంకటేశ్వర్లు నివాసం ఉంటున్నాడు. నిన్న రాత్రి 11గంటల వరకు కడప 2వ పట్టణ పీఎస్‌లో విధులు నిర్వహించాడు. అనంతరం ఇంటికి వస్తున్న సమయంలో తనతో పాటు తుపాకీని ఇంటికి తీసుకొని వచ్చారని కడప డీఎస్పీ షరీఫ్ పేర్కొన్నారు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగి ఉండవచ్చని వారు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో అన్ని తేలుతాయని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు వెంకటేశ్వర్లు సూసైడ్ నోట్ రాశారు. ఆత్మహత్యకు గల కారణాలను వివరంగా ప్రస్తావించారు. అయితే విచారణ అనంతరం ఆ విషయాలన్నీ తేలుతాయన్నారు. ముఖ్యంగా రెండో భార్యకు సంబంధించి సూసైడ్ లెటర్‌లో రాసినట్లు డీఎస్పీ స్పష్టంగా తెలిపారు.
This browser does not support the video element.
విచారణ తర్వాత అన్ని వివరాలు
అయితే.. వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు చేసుకోవడానికి ఉపయోగించిన తుపాకీ ఆయనది కాదని డీఎస్పీ షరీఫ్ చెప్పారు. నిన్న రాత్రి 11 గంటల వరకు పీఎస్‌లో పని చేసిన ఆయన.. వస్తూ ఎవరిదో పిస్తోలు తెచ్చుకున్నట్లు తెలిపారు. విచారణ తర్వాత అన్ని వివరాలను చెబుతామని డీఎస్పీ షరీఫ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలకు ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ, ఒకేసారి నలుగురి ప్రాణాలు పోవడం స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఇలా చేయడానికి గల కారణాలపై ఆరా తీశారు. వ్యక్తిగత కారణాలతోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు కడప డీఎస్పీ షరీఫ్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: చంద్రబాబు రిమాండ్ పొడిగించండి.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ