Putin : రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్(Putin) ప్రత్యర్థి, ప్రతిపక్ష నేతల అలెక్సీ నావల్ని జైలులో అనుమానస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) సంచలన వ్యాఖ్యలు చేశారు. నావల్ని మృతికి పుతినే బాధ్యుడు అంటూ ఆరోపణలు చేశారు. ఈ మరణ వార్త తనను ఆశ్చర్యపరచనప్పటికీ.. ఇది విన్న తర్వాత ఆగ్రహానికి గురయ్యానని పేర్కొన్నారు. పుతిన్ ప్రభుత్వ విధానాలపై.. లోపాలు, హింస, అవినీతికి వ్యతిరేకంగా.. నావల్నీ గళం వినిపించినట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నామని వైట్‌హౌస్ ప్రతినిధులు చెప్పారు.
Also Read : ఎలాన్ మస్క్ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా ?
గతంలోనే హెచ్చరించిన బైెడెన్
ఇదిలా ఉండగా.. ఆర్కిటిక్ సర్కిల్(Arctic Circle) కు ఉత్తరాన ఉన్న రష్యన్ పీనల్ కాలనీలో నావల్నీ ప్రాణాలు కోల్పోయారు. అయితే 2 నెలల క్రితమే జైలు అధికారులు ఆయన్ని అక్కడికి తరలించారు. నావల్ని మరణం.. వ్లాదిమీర్ పుతిన్‌కు వినాశనకరమైన పరిణామాలను కలిగిస్తుందని కొన్ని సంవత్సరాల క్రితమే అగ్రరాజ్యం అధ్యక్షుడు బైడెన్ హెచ్చరికలు చేశాడు. 2021లో జెనీవాలో.. పుతిన్‌తో ఆయన సమావేశమైన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్.
పుతిన్ అంటే ఏంటో ఇది తెలియజేస్తుంది
మరోవైపు నావల్ని మరణంపై కెనడా(Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau) కూడా స్పందించారు. ఇది విషాదకర ఘటన అని.. రష్యా ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేసే వారిని అణిచివేసేందుకు రష్యా అధ్యక్షుడు ఎంతవరకు తెగిస్తారో ఈ ఘటన తెలియజేస్తోందని అన్నారు. ఇది పుతిన్ అంటే ఏంటో ప్రపంచానికి గుర్తు చేస్తోందని అన్నారు.
పుతిన్ శిక్ష నుంచి తప్పించుకోలేరు
ఇక నావల్ని మరణంపై ఆయన భార్య యులియా నావల్నయా కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఇది గనుక నిజమైతే.. పుతిన్, ఆయన అనుచరులు శిక్ష నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. పుతిన్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని నమ్మలేమన్నారు. వాళ్లు ఎప్పుడు కూడా అబద్దాలే చెబుతారని పేర్కొన్నారు. కానీ వారు చెప్పింది నిజమైతే.. నా దేశానికి, నా కుటుంబానికి జరిగిన అన్యాయానికి.. పుతిన్, ఆయన పరివారం బాధ్యత వహించాల్సి ఉంటుందని.. ఆ రోజు త్వరలోనే వస్తుందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రష్యాలో ఉన్న భయంకర పాలనకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఒకటి కావాలని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వేదికగా పిలుపునిచ్చారు.
Also Read : రష్యా ఉపగ్రహాలను అంతం చేసే ఆయుధం తయారుచేస్తోంది: అమెరికా