Janasena vs YCP: రాజకీయాలు అంటేనే.. వ్యూహ ప్రతివ్యూహాలు. తిట్లు.. పొగడ్తలు.. విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఒక్కోసారి అదిలింపులు.. బెదిరింపులు.. ఇవన్నీ కలిస్తేనే రాజకీయం. మామూలు సమయంలో రాజకీయాలు కాస్త సాగదీత సినిమా చూస్తున్నట్టు ఉంటాయి. కానీ, ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మాస్ మసాలా సినిమాలు ఓ పది ఒకేసారి చూస్తున్నట్టు ఉంటుంది. గోడలు దూకేవాళ్లు.. దూకడం కోసం పాకులాడేవారు.. ఎగదోసేవారు.. ఎగసి పడేవారు.. తిట్టిన నోటితోనే పొగిడే వాళ్ళు.. కస్సుమన్న వారి దగ్గరే కరుచుకుని కూచునేవాళ్ళు.. సీటు కోసం కొందరు.. నోటు కోసం మరికొందరు. వీరందరి హడావుడి మధ్య.. ఎన్నికల చిత్రాలు చూడాలంటే భలే ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఏపీ రాజకీయాలు సరిగ్గా ఇలానే ఉన్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ (CM YS Jagan) ఒకవైపు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోవైపు.. ఎన్నికలు తరుముకు వస్తున్న వేళ గెలుపు కోసం వ్యూహాలను మొదలు పెట్టారు. కుల రాజయకీయాలు.. పొత్తు సన్నివేశాలు.. మధ్యలో జంపింగ్ జపాంగ్స్ తో ఏపీ రాజకీయ చిత్రం మంచి ఊపు మీద ఉంది. టీడీపీతో పొత్తు అంటూ జనసేనాని (TDP-Janasena Alliance) ప్రకటించిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత రంజుగా మారిపోయాయి. కులాల మధ్య అంతరాలు ఏపీ రాజకీయాల్ని శాసిస్తాయి. ఈ విషయం ఎవరిని అడిగినా చెప్పేస్తారు. సరిగ్గా దానికి రివర్స్ లో ఒక కులం మధ్యలో చిచ్చు పెట్టడమే ఎజెండాగా వైసీపీ నడుస్తున్నట్టు ఏపీరాజకీయాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించినప్పుడు.. ఆయన రాజకీయ యాత్రలు చేసినపుడు.. తన కులానికి చెందిన మంత్రులు.. నాయకులతోనే వైసీపీ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయిస్తూ వచ్చింది. ఇప్పుడు సీన్ క్లైమాక్స్ కి చేరడంతో కులాన్ని చీల్చడం అనే వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది.
ఊహించిందే..
జనసేనాని తనకు తానుగా టీడీపీతో పొత్తుకు ముందుకు దూకారు. అప్పుడు కష్టాల మధ్యలో ఉన్న టీడీపీకి దిక్కు చూపించిన స్నేహితుడిలా నిలబడ్డారు. తరువాత రెండు పార్టీల మధ్య పొత్తు విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ పొత్తు ఖాయంగా చెబుతూ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో జనసేనకు ఎన్ని సీట్లు టీడీపీ ఇస్తుంది అనే విషయంలో రకరకాల అంచనాలు వేశారు. అన్ని అంచనాలు కూడా నామమాత్రపు సీట్లలోనే జనసేన పోటీ చేసేలా చంద్రబాబు నాయుడు పావులు కడుపుతారని లెక్క కట్టాయి. చివరికి అదే నిజం అయింది. కేవలం 24 అసెంబ్లీ సీట్లలోనే జనసేన పోటీకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఊహించిన విషయమే.
జనసేనలో అసంతృప్తి..
పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటును ప్రకటించిన వెంటనే, జనసేనలో అసంతృప్తి తీవ్రస్థాయిలో కనిపించింది. అటు టీడీపీలోనూ అలానే పరిస్థితి ఉన్నా.. అది ఇప్పటికీ పూర్తిగా బయటపడటం లేదు. కానీ, జనసేన విషయంలో మాత్రం అది విస్పష్టంగా ఇంకా చెప్పాలంటే చాలా బలంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. పూర్తిగా కులం చిత్రంలో జనసేన చిక్కుకుపోయింది. జనసేనలో కాపు కుల నాయకులు అందరూ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పైమాటల దాడి మొదలు పెట్టారు. కనీసం 40 స్థానాలు కూడా తీసుకునే ప్రయత్నం చేయలేదంటూ దుయ్యబడుతున్నారు. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు లొంగిపోయారంటూ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు ప్రయత్నించే అవకాశం కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ కి దక్కడం లేదు.
Also Read: టీడీపీలోకి కందుకూరు MLA మానుగుంట?
పవన్ చుట్టూ కుల చక్రవ్యూహం..
సరిగ్గా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ సన్నాహాలు (Janasena vs YCP) మొదలు పెట్టింది. పవన్ కళ్యాణ్ ను ఒంటరి చేసేందుకు రాజకీయ చక్రవ్యూహం పన్నింది. నిజానికి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే పవన్ విషయంలో జగన్ చాలా క్లారిటీతో ఉన్నారనీ.. చంద్రబాబు కంటే కూడా రాజకీయంగా తనకు ఇబ్బంది పవన్ తోనే ఎక్కువనే లెక్క ఎప్పుడో వేశారని అర్ధం అవుతోంది. అందుకే, పవన్ సెంట్రిక్ గా మొదటి నుంచి వైసీపీ నాయకులతో రకరకాలుగా ప్రచారాలు చేయిస్తూ వచ్చారనేది విశ్లేషకుల అభిప్రాయం. తెలుగుదేశంతో పొసగలేక.. లేదా అక్కడ తమకు అవకాశం లేక పక్కకు జరిగిన వెటరన్ నాయకులను సరైన సమయంలో ఉపయోగించుకోవడం కోసం వేచి చూస్తూ వచ్చారు. ఇదిగో సరిగ్గా ఇప్పుడు ఆ సమయం వచ్చింది. తమంత తాముగా ఎన్నికల్లో నేరుగా పోటీచేసే ఉద్దేశ్యం లో లేని పెద్ద కాపు నాయకుల పిల్లలకు సీట్లు ఇస్తామంటూ కొత్త రాజకీయానికి తెరలేపింది. కచ్చితంగా ఇది పవన్ ను చక్ర వ్యూహంలో బంధించడమే. తనకున్న పరిధిలో 24 సీట్లలో ఈ నాయకుల కొడుకులకు సీట్లు ఇవ్వగలిగే పరిస్థితి జనసేనానికి ఉండదు. అలా అని వారిని వదిలేయలేరు. వదులుకోకూడదని తాను అనుకున్నా.. జగన్ సీట్ల కేటాయింపు గాలంతో వారిని తమవైపు తిప్పేసుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు.
ఇందులో భాగంగా ముద్రగడ పద్మనాభం (Mudragada), చేగొండి హరిరామ జోగయ్యల (Harirama Jogaiah) తనయులకు సీట్లు ఆఫర్ చేసి జనసేన ఓటు బ్యాంకుకు గండి కొట్టడానికి ఆపరేషన్ ప్రారంభించారు. పవన్ పోటీచేస్తున్న పిఠాపురంలో హరిరామ జోగయ్య తనయుడిని నిలబెట్టాలని వ్యూహం పన్నారు. ఇప్పుడు మొత్తంగా చూస్తే.. మొదటి నుంచి పవన్ ను విమర్శిస్తూ వచ్చిన వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా పవన్ తో ఉన్న నాయకులను ఒక్క మాట కూడా తూలని వైనం రాజకీయంగా పవన్ ను ఎదుర్కోవడానికి ఎప్పుడో పన్నిన జగన్ వ్యూహంగా అర్ధం చేసుకోవచ్చు. తలోదిక్కుకు పరుగులు తీసే.. ఎటు గాలి కనిపిస్తే అటు వెళ్లిపోయే నాయకులను నమ్ముకున్న పవన్ కళ్యాణ్ కి సరైన సమయంలో చెక్ పెట్టాలని చేసిన ప్లాన్ ఇది అని చెప్పవచ్చు. టీడీపీ - జనసేన పొత్తులో కచ్చితంగా లుకలుకలు వస్తాయని.. సీట్ల పంపకాలు జనసేన నేతల్లో తీవ్రమైన అసంతృప్తిని తెస్తాయని అందరూ ఊహించిందే. సరిగ్గా అది నిజమయ్యేసరికి వైసీపీ ఒక్కసారిగా తన వద్ద దాచిన అస్త్రాలు అన్నిటినీ పవన్ పైన ప్రయోగించేసింది. దీంతో పవన్ ను ఒంటరి చేసే వ్యూహం సక్సెస్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.
మొత్తంగా చూసుకుంటే.. ఎన్నికలు తరుముకువస్తున్న ప్రస్తుత పరిస్థితిలో.. జనసేనాని ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కుంటారు? టీడీపీ-జనసేన కలయికతో సునాయాసంగా వైసీపీని ఓడించవచ్చని ప్లాన్ చేసిన చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు ఏం చేస్తారు? రాజకీయాల్లో జంపింగ్స్ సాధారణం అంటూ ప్రజలు లైట్ తీసుకుంటారా? లేక పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపిస్తారా? ఇప్పుడు జనం ఎవరి పవర్ కోసం కాపు కాస్తారు అనే ప్రశ్నలు పొలిటికల్ గా హీట్ పెంచుతున్నాయి. జవాబులు కూడా దొరకని ప్రశ్నలుగా మిగిలాయి.
- KVD వర్మ