జనగామ జిల్లా మరో అవినీతి బయటపడింది. ఓ భవన నిర్మాణ విషయంలో పెద్ద మొత్తంలో కమీషన్ వసూల్ చేసిన మున్సిపల్ కమీషనర్ ను అవినీతి నిరోధకశాఖ అధికారులకు (ఏసీబీ) పట్టుకున్నారు.
ఈ మేరకు వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడెంకు చెందిన చెట్టిపల్లి రాజు గత ఏడాది జూన్‌లో జనగామ కలెక్టరేట్ ఎదుట జీప్లస్-3 భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో నిర్మాణాన్ని పూర్తిచేశారు. నిబంధనల ప్రకారం 10 శాతం స్థలాన్ని మున్సిపాల్టీకి మార్ట్‌గేజ్ చేశారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సైతం తీసుకున్నారు. అయితే మున్సిపాల్టీకి కుదువ పెట్టిన 10 శాతం స్థలాన్ని విడిపించి ఇవ్వాలని కమిషనర్ రజితకు దరఖాస్తు చేశారు. స్థలాన్ని విడిపించేందుకు రూ.60 వేలు ఇవ్వాలని కమిషనర్ అడగ్గా దీనిపై ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించారు.
Also read : Telangana Elections: కాంగ్రెస్ నేత వివేక్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు..
ఈ క్రమంలోనే అధికారుల సూచనల మేరకు రాజు రూ.40 వేలు తీసుకెళ్లగా తన డ్రైవర్ నవీన్‌కు ఇవ్వాలని రజిత సూచించారు. నవీన్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే తాను డబ్బులు తీసుకున్నట్లు డ్రైవర్ అంగీకరించాడు. కమిషనర్ రజితను, డ్రైవర్ నవీన్‌ను కస్టడీలోకి తీసుకున్నామని, వారిని విచారించి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సోదాల్లో డీఎస్పీతో పాటు ఇన్‌స్పెక్టర్లు శ్యామ్, రవి, శ్రీనివాస్ పాల్గొన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త జనగామ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.