Kadapa Politics : రాజకీయాలు.. తల్లీ.. చెల్లీ.. తండ్రి.. తనయుడు ఇలాంటి బంధాలకు.. బంధుత్వాలకు ఏమాత్రం విలువ ఇవ్వవు. అందులోనూ ఏపీ రాజకీయాల్లో నేతలకు పదవి ముందు బాంధవ్యాలు పెద్ద లెక్కలోనివి కాదు. ప్రస్తుతం అక్కడ రాజకీయ వేదికపై ఆసక్తికరమైన చర్చ.. అందరినీ ఆకర్షిస్తున్న వార్తలు ఈ కోణంలోనే ఉన్నాయి. దానికి కారణం వైసీపీ (YCP) దారుణ ఓటమి. మడమతిప్పనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తనకు వచ్చిన పదకొండు సీట్లతో అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఇష్టపడకపోవడం. ఇప్పుడు ఏమి చేయాలి అనే తర్జన భర్జనలో.. రాష్ట్రాన్ని వదిలిపెట్టి జాతీయ రాజకీయాల్లోకి దూరిపోవాలనే వ్యూహం తెరమీదకు రావడం. ప్రస్తుతం ఇదే అతిపెద్ద రాజకీయ చర్చనీయాంశంగా ఆంధ్రప్రదేశ్ లో కనబడుతోంది.
ఎందుకీ చర్చ?
అందరికీ తెలిసిందే.. మొన్నటి వరకూ 151 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని అధినాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా వెలిగారు. ఇప్పుడు తనతో కలిపి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలవడంతో గతకాలపు ప్రభ మసకబారిపోయింది. ఇంకా చెప్పాలంటే కనపడకుండా పోయింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి స్థితిలో ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. రెండు నిమిషాల్లో శాసనసభ నుంచి బయటకు వచ్చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన అసెంబ్లీకి తిరిగి వచ్చే అవకాశమే లేదనే వార్తలు.. విశ్లేషణలు ఏపీ రాజకీయ చిత్రంపై విపరీతంగా కనిపించాయి. దానిని బలపరుస్తూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమావేశాల సమయంలోనూ జగన్ అండ్ కో అసెంబ్లీకి మొహం చాటేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులలో కూడా జగన్ అసెంబ్లీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ వస్తోంది.
ఇప్పుడేమంటున్నారు?
Jagan vs Sharmila : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) వారసుడిగా ఏపీ రాజకీయాల్లో నిలబడి.. రాజకీయాలను శాసించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త వ్యూహానికి తెరతీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విశ్లేషకుల అంచనాలు.. అందుతున్న వార్తలు.. టీడీపీ నేతల ప్రచారం నిజమైతే.. జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ సీటుకు రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం.. ఒక మామూలు ఎమ్మెల్యేలా సభావ్యవహారాల్లో పాలుపంచుకోవడం స్వతహాగా విపరీతమైన అహం కలిగిన నాయకుడిగా జగన్ సహజంగానే ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం అనే పరిస్థితిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో తానూ అసెంబ్లీకి రాజీనామా చేసి.. కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని పెద్ద ఎత్తున ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేగా పోటీలో ఉంచుతారని లేదా జగన్ సతీమణి భారతిని తెరమీదకు తీసుకువస్తారని గుసగుసలు రాజకీయ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి.
Also Read : కొత్త రేషన్ కార్డులపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
అదే నిజమైతే..
ఇప్పటివరకు చాలా బలంగా వినిపిస్తున్న ఈ వాదనలు నిజం అయితే, కడప రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంది. ఒకరకంగా జగన్ చేస్తారని చెబుతున్న ఈ విన్యాసం వైఎస్ వారసుల మధ్య పెద్ద యుద్ధాన్ని తీసుకువచ్చేదిగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఒకవేళ జగన్ అసెంబ్లీకి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తే.. అక్కడ నుంచి అన్న మీద బరిలోకి దిగడానికి దివంగత నేత వైఎస్సార్ తనయ షర్మిల రెడీ అవుతారని కాంగ్రెస్ (Congress) వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హాజరైన కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని బాహాటంగానే చెప్పుకున్నారని అంటున్నారు. ఇలాగే పోటీ జరిగితే అది కడప ఎంపీ స్థానానికి పోటీ కాదనీ, వైఎస్ వారసత్వానికి పోటీగా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కరలేదు. ఇది కడప ఎంపీకి సంబంధించి ఒక కోణం.
పులివెందులలో ఏమవుతుంది?
ఇక పులివెందుల (Pulivendula) అసెంబ్లీ స్థానానికి వైఎస్ అవినాష్ రెడ్డిని పోటీ చేయిస్తే కనుక ఆయనపై వైఎస్సార్ సతీమణి విజయమ్మను కాంగ్రెస్ పార్టీ పోటీకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే, ఇది అంత సులభం కాదనీ.. విజయమ్మ పోటీకి అంగీకరించకపోవచ్చనీ కొందరు అంటున్నారు. కానీ, పులివెందుల నియోజకవర్గం విషయంలో చాలా ఏళ్లుగా వైఎస్ కుటుంబంలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. అవినాష్ రెడ్డిని కానీ, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కానీ పులివెందులలో రాజకీయంగా అడుగుపెట్టనిచ్చేది లేదంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలోనే ఆయన కుటుంబీకులు చెప్పుకున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందుల విషయంలో వైఎస్సార్ మరణం తరువాత తాను లేదా విజయమ్మ లేదా జగన్ లేదా షర్మిల మాత్రమే పోటీలో ఉండాలని.. భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వాల్సిన పనిలేదని ఖరాఖండిగా చెప్పారని అప్పట్లో అనుకున్నారు. ఆ పట్టుదలే ఆయన ప్రాణాలు తీసిందనేది కూడా పులివెందుల రాజకీయాల్లో వినిపించే మాట. దీంతో ఇప్పుడు అవినాష్ రెడ్డి కనుక పోటీ చేస్తే.. విజయమ్మ తప్పనిసరిగా ఆయనకు వ్యతిరేకంగా పోటీలో ఉంటారనేది ఒక వర్గం చేస్తున్న వాదన. ఒకవేళ అవినాష్ రెడ్డి బదులుగా భారతి రెడ్డి పోటీకి దిగితే మాత్రం విజయమ్మ పోటీ చేయకపోవచ్చనేది ఒక అంచనా. అప్పుడు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి బరిలో ఉండే అవకాశం ఉందనే ఊహాగానం వినిపిస్తోంది.
ఏమైనా జరగవచ్చు..
రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఊహాగానాలు కావచ్చు. కానీ వైఎస్సార్ కుటుంబంలో వారసత్వ పోటీ గట్టిగానే ఉందనే విషయం సుస్పష్టం. జగన్ అధికారంలో ఉన్నపుడే షర్మిల ఆయనను రాజకీయంగా చాలా బలంగా ఢీ కొట్టారు. టీడీపీ ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారంటూ ప్రచారం చేసినా.. అది నిజం కాదని ఎన్నికల సమరం తేల్చేసింది. జగన్మోహన్ రెడ్డి.. షర్మిల మధ్య రాజకీయ యుద్ధం ఇప్పుడు ఆసక్తికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. జగన్ కడపలో ఎంపీగా పోటీ చేసి.. షర్మిల మనకు వ్యతిరేకంగా పోటీచేస్తే కనుక అది ఏపీ రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లోనే పెద్ద సంచలనంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. ఒకేవేళ అటువంటి పోటీ జరిగి.. అందులో ఎవరు గెలిస్తే వారిని వైఎస్ వారసులుగా ప్రజలు అంగీకరించారు అని చెప్పడానికీ సంకోచించే పరిస్థితి ఉండదు. మొత్తంగా చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీ తన రూటే సపరేటు అని మరోసారి నిరూపించుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. గెలుపు ఓటములు పక్కన పెడితే.. అన్నా చెల్లెళ్ళ మధ్య జరిగే ఈ వారసత్వ పోటీ ఆంధ్రప్రదేశ్ లో సామాన్యుల నుంచి మాన్యుల వరకూ అందరిలోనూ పెద్ద థ్రిల్లింగ్ సినిమా క్లైమాక్స్ లా అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు.