Lok Sabha Elections 2024: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 370 ఎంపీ సీట్లు గెలుస్తుందని, మిత్రపక్షాలతో కలిసి 400 దాటుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూ వస్తున్నారు. తద్వారా బీజేపీ కార్యకర్తల్లోనూ మోడీ మనోధైర్యాన్ని పెంచారు. అయితే ఈసారి మోడీ గెలిస్తే భారత రాజకీయ చరిత్రలో మూడోసారి ప్రధాని పదవిని పొందినవారిలో రెండవ వ్యక్తి అవుతారు. 1962లో జవహర్‌లాల్ నెహ్రూ మూడోసారి అధికారంలోకి వచ్చిన చివరి ప్రధాని. 1962లో నెహ్రూ మూడవసారి అధికారంలోకి వచ్చినప్పుడు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ పెంటపాటి పుల్లారావు (Analyst Pentapati Pullarao) అంటున్నారు.
మోడీకి పెద్ద సవాలే..
ప్రస్తుతం బీజేపీకి ప్రతి రాష్ట్రంలోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అలాంటి రాష్ట్రాల్లో బీజేపీ అన్నీ స్థానాలు గెలవడం చాలా కష్టం. అలాగే, 1984లో ఇందిరాగాంధీ హత్య కారణంగా ఆ పార్టీ 400 మందికి పైగా ఎంపీలు విజయం సాధించారు. కానీ బీజేపీకి ఆ అవకాశం లేదు. ఒంటరిగా 370 ఎంపీలను సాధించడం, కూటమి 400 ఎంపీలను దాటడం మోడీకి పెద్ద సవాలే.
అసాధ్యంగా కనిపిస్తోంది..
ఇప్పుడు దేశంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రస్తుత ఎన్నికల్లో పోరు తీవ్రంగా ఉండే అనేక రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్, మహారాష్ట్రలలో 88 మంది ఎంపీ స్థానాలున్నాయి. 2019 తర్వాత బీహార్, మహారాష్ట్రలను బీజేపీయేతర పార్టీలు పాలించాయి. ఇప్పుడు మహారాష్ట్ర, బీహార్‌లలో బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఉన్న మాట వాస్తవమే. అయితే మొన్నటి వరకు ప్రతిపక్షాలు పాలిస్తున్నందున ఈ రెండు రాష్ట్రాల నుంచి సవాలు ఎదురుకాక తప్పదు. 2019లో ఈ రెండు రాష్ట్రాల్లోని 88 ఎంపీలకుగాను 81 ఎంపీలను బీజేపీ గెలుచుకుంది. ఆ సంఖ్య ఇప్పుడు అసాధ్యంగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి : Spain: వాలెన్సీయాలో భారీ అగ్నిప్రమాదం.. 24మంది మృతి!
అప్రమత్తమైన మమతా..
బెంగాల్‌లో 42 ఎంపీ స్థానాలుండగా వాటిలో 18 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. నిజానికి బెంగాల్ లో బీజేపీకి ఇవి ఘననీయమైన స్థానాలే. దీనికి కారణం గత ఎన్నికల్లో మమతా బెనర్జీ బీజేపీని తక్కువగా అంచనా వేయడంతో ఇది సాధ్యమైంది. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్తలు తీసుకుంటుందనటంలో సందేహం లేదు. మరోవైపు మమతా కాంగ్రెస్ కు చెందిన ఇండియా కూటమిలో చేరడం వల్ల కాంగ్రెస్, తృణమూల్ కలసి పోటీ చేస్తే బెంగాల్ లో బీజేపీ తన సిట్టింగ్ స్థానాలను ఘననీయంగా కొల్పొయే అవకాశం లేకపోలేదు.
ఒడిశాలో 10 స్థానాలే..
ఒడిశాలో 21 ఎంపీ స్థానాలకుగాను గత ఎన్నికల్లో బీజేపీకి 10 స్థానాలు దక్కాయి. నిజానికి ఈ విజయం నవీన్ పట్నాయక్ ను కూడా ఆశ్చర్యపరిచింది. అందుకే ఈసారి ఎన్నికల్లో నవీన్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనివల్ల ప్రస్తుత స్థానాలు పూర్తి స్థాయిలో దక్కుతాయన్న ఆశ కనిపించట్లేదు.
కాంగ్రెస్ ఫ్రీబస్ ప్రభావం..
కర్ణాటకలో 28 ఎంపీ స్థానాల్లో 26 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీబస్ మ్యానిఫెస్టోలో చాలా హామీలు అమలు చేసింది. దీని ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై తప్పక ఉండబోతుంది. ఒకవేళ అక్కడ దేవెగౌడతో పొత్తు పెట్టుకున్నప్పటికీ 28 స్థానాలకుగాను 26 స్థానాలు దక్కుతాయనే గ్యారంటీ ఏమాత్రం లేదు. కాంగ్రెస్ ఫ్రీబస్ ప్రభావం కూడా కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉంది.
తెలంగాణలో ప్రతికూల ప్రభావం..
తెలంగాణలో 17 ఎంపీ స్థానల్లో 4 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని ప్రభావం ఎన్నికల్లో బలంగా ఉండనుంది. ఇది బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. 2019లో 17 మంది ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించింది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 10 స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వేలు తెలుపుతున్నాయి. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండవస్థానంలో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి ఇప్పుడున్న నాలుగు స్థానాలు కూడా దక్కడం కష్టమేనన్నది అందరి అభిప్రాయం.
బీజీపీ లక్ష్యానికి కాంగ్రెస్ గండి..
ఢిల్లీ ,పంజాబ్ లలో బీజేపీ కాంగ్రెస్, కేజ్రీవాల్ కూటమిని ఎదుర్కొంటుంది. బీజేపీకి 7శాతం ఓట్లు మాత్రమే ఉన్న ఢిల్లీ , పంజాబ్‌లో బీజేపీ గట్టి పోటీ ఎదుర్కొక తప్పదు. 2019లో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌లలో బీజేపీ దాదాపు 100 శాతం ఎంపీ స్థానాలను సాధించింది. వీటిలో కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఘననీయ స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఆ లెక్కన కొన్ని స్థానాలను కాంగ్రెస్ దక్కించుకున్నా బీజీపీ లక్ష్యానికి గండి పడినట్టే.
వాజ్‌పేయ్ ఓటమి గుర్తు చేసుకోవాలి..
2014లో కంటే ఈరోజు నరేంద్ర మోడీకి ఎక్కువ జనాదరణ ఉందనడంలో సందేహం లేదు. కానీ ప్రతిపక్షం 2019 కంటే ఈరోజు మరింత ఐక్యంగా ఉంది. ఇదే క్రమంలో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉంది. కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ గట్టిపోటీని ఎదుర్కొంటోంది. ఎన్నికలను అంచనా వేయడం కష్టం. ఇంకా 75 రోజుల సమయం ఉంది. 2004 ఎన్నికల్లో అతి విశ్వాసంతో ఉన్న బీజేపీ, అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఎలా ఓడిపోయారో నరేంద్ర మోడీ గుర్తు చేసుకోవాలి.
ఊహించినంత తేలికేం కాదు.
2004లో బీజేపీ 300 మంది ఎంపీ స్థానాలను గెలుస్తామని ధీమాగా చెప్పుకుంది. కానీ, 138 మాత్రమే గెలిచి ప్రభుత్వాన్ని కోల్పోయింది. అయితే మోడీ, బీజేపీలు అలాంటి షాక్ ఓటమిని తప్పించుకునేందుకు ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ రోజు బీజేపీకి వ్యతిరేకత మరింత పెరిగింది. అలాగే ప్రతిపక్షాలు సైతం చాలాచోట్ల పుంజుకున్నాయి. అందుకే 2024లో జరిగే పోరు ఊహించినంత తేలికేం కాదు. రానున్న ఎన్నికల్లో బీజేపీ 400 సీట్ల లక్ష్యం నల్లేరుమీద నడక ఎంతమాత్రం కాదన్నది వాస్తవం. ఈ ఎన్నికల్లో ఎంత కష్టపడినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుతారనేది వాస్తవ విరుద్దమే కాక సాధ్యమయ్యేది కూడా కాదు.