ఇజ్రాయెల్ - హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే గాజాను నలుమూలలా చుట్టుముట్టిన ఇజ్రాయెల్ బలగాలు.. ఆ నగరాన్ని రెండు విభజించామని ప్రకటన చేశాయి. గాజాను చుట్టుముట్టామని.. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విభజించామని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ వెల్లడించారు. ఈ యుద్ధంలో ఇది ముఖ్యమైన దశ అని.. మేం మరింత కీలకమైన దాడులు చేయబోతున్నామని వివరించారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు గాజా దక్షిణ ప్రాంతాన్ని చేరుకున్నాయి. మరో 48 గంటల్లోనే అటువైపు నుంచి గాజా భూభాగంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు ఉత్తర గాజాలో కూడా భీకర దాడులు జరుగుతున్నాయి.
Also read: గాజాలో శరణార్ధుల శిబిరాల మీద ఇజ్రాయెల్ దాడి..73మంది మృతి
బందీలను హమాస్ వదిలిపెట్టేంతవరకు కాల్పుల విరమణకు ఒప్పుకునేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి చెప్పారు. మాకు మరో మార్గం లేదని.. గెలిచే వరకు యుద్ధం కొనసాగిస్తామని అన్నారు. ఈ యుద్ధాన్ని ప్రారంభించింది హమాసేనని.. మమ్మల్ని అంతం చేయాలని ఆ ముఠా కోరుకుందని.. ఇలాంటి తప్పు చేసిన హమాస్‌ను సమూలంగా నాశనం చేయాలనుకుంటున్నామని నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ - హమాస్ పోరు జరుగుతున్న నేపథ్యంలో.. అమెరికా పశ్చిమాసియాలో దౌత్య యత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. అనూహ్యంగా వెస్ట్‌బ్యాంక్‌కు వెళ్లి పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో కలిసి భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇరాక్‌లో పర్యటించారు. ఆ తర్వాత ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుదానీని కలిసి.. అక్కడి నుంచి తుర్కియేకు వెళ్లిపోయారు.