ప్రస్తుతం దేశంలో లక్షద్వీప్ వివాదం సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను సందర్శించిన అనంతరం ఆ ప్రాంతాన్ని పొగుడుతూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశాక.. మాల్దీవులకు చెందిన మంత్రులు ప్రధానిపై, విరుచుకుపడ్డారు. దీంతో ఆ మంత్రులపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే మాల్దీవుల ప్రభుత్వం ఆ మంత్రులను సస్పెండ్ చేసింది. ఇక మాల్దీవులకు పోటీగా లక్షద్వీప్‌ను అభివృద్ధి చేసే దిశగా అధికారులు చర్యలు చెపడుతున్నారు. అక్కడ నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియ మంగళవారం నుంచి జరగనుంది.
భారత్‌లో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తన ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన విషయాన్ని పోస్టు చేసింది. నిర్లవణీకరణ ప్రక్రియను మొదలుపెట్టాలన్న భారత ప్రభుత్వం కోరిక మేరకు తాము గత ఏడాది నుంచి లక్షద్వీప్‌లో ఉన్నామని తెలిపింది. అక్కడ పనులు ప్రారంభించబోతున్నామంటూ చెప్పింది. అక్కడ ఉన్న బీచ్‌లకు సంబంధించి కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది. అయితే ఇజ్రాయెల్‌లో కూడా నిర్లవణీకరణ ప్రక్రియను వినియోగిస్తున్నారు. అక్కడ దాదాపు 25 శాతం తాగునీరు ఈ నీర్లవణీకరణ ప్లాంట్ల నుంచే ఉత్పత్తి కావడం విశేషం.
నీర్లవణీకరణ అంటే ఏంటీ
ఈ నీర్లవణీకరణ ప్రక్రియ అక్కడ సక్సెస్ కావడం వల్లే లక్షద్వీప్‌లో కూడా నీర్లవణీకరణ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం గతంలో ఇజ్రాయెల్‌ను ఆహ్వానించింది. ఇంతకీ అసలు నిర్లవణీకరణ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందా. సముద్రపు నీటిలో ఉండే లవణాలను తొలగించి.. వాటిని తాగేందుకు వీలుగా చేసే ప్రక్రియనే నిర్లవణీకరణ (డిశాలినేషన్) ప్రక్రియ అని అంటారు. వాస్తవానికి సముద్ర ఉపరితల నీటి కంటే వెయ్యి నుంచి 2 వేల అడుగుల లోతులో ఉండే నీటి ఉష్ణోగ్రతలు 4 నుంచి 8 డిగ్రీలు తక్కువగా ఉంటాయి.
ఇజ్రాయిల్ కూడా తోడయితే
అయితే ఆ నీటిని సేకరించి ప్రత్యేక పరిస్థితుల్లో గడ్డ కట్టిస్తారు. అనంతరం మళ్లీ ఆ నీటిని వేడి చేశాక.. దాన్ని నీటి ఆవిరి గొట్టాల గుండా సేకరించి మంచి నీటిగా వినియోగించుకుంటారు. ఇందుకోసం రివర్స్ ఆస్మాసిస్ అనే టెక్నాలజీని వాడుతారు. మరో విషయం ఏంటంటే ఇప్పటికే లక్షద్వీప్‌లో ఆరు ప్లాంట్ల ద్వారు నీటిని శుద్ధి చేసి తాగునీటిని అక్కడి ప్రజలకు అందిస్తున్నారు. ఒక్క ప్లాంటు నుంచి రోజుకు దాదాపు లక్ష లీటర్ల నీటిని శుభ్రం చేసేలా భారత ప్రభుత్వం వాటిని తయారుచేయించింది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా మనతో కలిసి మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేస్తే అక్కడ నీటి కొరత తగ్గుతుంది. దీంతో అక్కడికి వచ్చే పర్యాటకులను మరింత ఆకర్షించవచ్చు. ఇప్పటికే భారత్‌లో పలువురు ప్రముఖులు, సెలబ్రటీలు లక్షద్వీప్‌ను సందర్శించాలంటూ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు చేస్తున్నారు.