Israel Ship Hijack: హాలీవుడ్ సినిమాలో యాక్షన్ సీన్‌ను తలపించేలా ఓ కార్గో షిప్‌ను హైజాక్(Hijack) చేశారు హౌతీ రెబెల్స్. టర్కీ నుంచి భారత్‌కు రావాల్సిన ఈ నౌకను ఎర్రసముద్రంలో యెమెన్ హౌతీ రెబెల్స్ హైజాక్ చేశారు. ఈ షిప్‌లో వేర్వేరు దేశాలకు చెందిన 25మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఐతే తాము ఇజ్రాయెల్ నౌకను స్వాధీనం చేసుకున్నామని..అందుకు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు హౌతీ తిరుగుబాటుదారులు.
ఎర్ర సముద్రంపై వెళుతున్న గెలాక్సీ లీడర్ అనే కార్గో షిప్‌ను ఓ హెలికాప్టర్‌తో వెంబడించారు హౌతీ రెబెల్స్. అదునుచూసి షిప్‌పై ల్యాండయ్యారు. తుపాకులతో కాల్పులు జరుపుతూ..కంట్రోల్ సెంటర్‌ను ఆధీనంలోకి తీసుకొని నౌకను యెమెన్‌లోని సలీఫ్ పోర్టుకు మళ్లించారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని..ఇజ్రాయెల్ గాజాపై యుద్ధాన్ని ఆపేంతవరకు దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. షిప్‌లో ఉన్న 25మంది సిబ్బందిని బందీలుగా తీసుకున్నారు. ఐతే ఆ కార్గో షిప్ తమది కాదని స్పష్టం చేసింది ఇజ్రాయెల్. బ్రిటీష్ కంపెనీకి చెందిన ఈ కార్గో షిప్‌లో ఇజ్రాయెల్ కంపెనీ అబ్రహం ఉంగార్‌కు కొంత వాటా ఉంది. ప్రస్తుతం ఈ నౌక జపాన్ నిర్వహణలో ఉంది.
ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిప్పైన్స్, మెక్సికోతోపాటు వేర్వేరు దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు. ఐతే ఈ నౌకలో భారతీయులు ఎవరూలేరన్న ఇజ్రాయెల్..అంతర్జాతీయ నౌకపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. ప్రపంచ పర్యవసానాలకు దారితీసే తీవ్రమైన ఘటన ఇది అని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నౌక టర్కీలో బయలుదేరి భారత్ వెళ్తోందని తెలిపింది.
ఈ హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్‌కు చెందినవారు. వీరిలో ఉన్న షియా ముస్లింలు..ఇరాన్ వైపు మొగ్గు చూపుతారు. ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కి మద్దతు తెలుపుతోంది. అందుకే హమాస్‌కి మద్దతుగా ఇజ్రాయెల్‌కి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఎర్ర సముద్రం గుండా ఇజ్రాయెల్ నౌకలు వెళ్తే.. దాడులు చేస్తామని హౌతీలు ఇదివరకే ప్రకటించారు. వాళ్లు చెప్పినట్లుగానే.. గెలాక్సీ లీడర్ నౌకను హైజాక్ చేశారు. ఐతే అది ఇజ్రాయెల్‌కు చెందింది కాదని..జపాన్ నిర్వహణలో ఉందని తెలిసినా, ఇంతవరకు నౌకను విడుదల చేయలేదు. దీంతో అటు ఇజ్రాయెల్, ఇటు హౌతీ రెబల్స్‌తోనూ చర్చలు జరుపుతోంది జపాన్. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం నేపథ్యంలో..ఎర్రసముద్రంలో కార్గో షిప్ హైజాక్ అవడం మాత్రం సంచలనంగా మారింది.
Also Read:
నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..
ఆ ఒక్కడికీ తప్ప అందరికీ రెస్ట్.. ఆసిస్ తో టీ20 సిరీస్ కెప్టెన్ గా సూర్య!