Telangana politics:బర్రెలక్క సాహసం..రాజకీయాల్లోకి యువత వచ్చేలా చేస్తుందా?

బర్రెలక్క..తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద సంచలనం. బడా నాయకులకు పోటీగా ఎన్నికల బరిలోకి దిగుతున్న బర్రెలక్క గెలుస్తుందా, లేదా అన్న విషయం పక్కన పెడితే భారత ప్రజాస్వామ్యానికి ఓ చుక్కానిలా మాత్రం కనిపిస్తోంది. యువత రాజకీయాల్లోకి రావడానికి పునాదిలా కనిపిస్తోంది.

New Update
Telangana politics:బర్రెలక్క సాహసం..రాజకీయాల్లోకి యువత వచ్చేలా చేస్తుందా?

రాజకీయాల్లో ఆరితేరిన వారి మధ్య ఒంటరి పోరాటం అంటే సాహసమనే చెప్పాలి. అది కూడా ఏ సపోర్ట్.. కనీసం డబ్బులు కూడా లేని ఓ పేద యువతి చేస్తోంది.. అంటే వామ్మో అనాల్సిందే. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇప్పుడు కొల్లాపూర్ శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ఇదే మాట్లాడుకుంటున్నారు. భారత దేశ ప్రజాస్వామ్యంలో ఆమెకు లభిస్తున్న మద్దతు యువతకు ఓ ఆశాకిరణంలా కనబడుతోంది. శిరీష కొల్లాపూర్ లో నామినేషన్ వేసినప్పుడు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆమె తెలంగాణలోనే కాదు ఆంధ్రా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా చాలా మందికి తెలిసి పోయింది. దీని కోసం ఆమె కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇవ్వలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఎక్కడా ప్రచారం కూడా నిర్వహించలేదు. హంగులూ, ఆర్భాటాలు లేకుండా కేవలం తన పరిమితిలోనే ప్రజలు తనకు ఎందుకు ఓటు వేయాలో చెప్పకుంటూ ప్రచారం సాగిస్తోంది. ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ ప్రజలు చూపు ఆమె మీదికి మళ్లింది. ఆమె మాటలు అందరికీ నచ్చడంతో పాటు నమ్మకం కల్పిస్తుండడంతో మద్దతు నానాటికీ పెరుగుతోంది. ఆమె స్ఫూర్తి నచ్చి.. చాలా మంది దాతలు ఆర్థిక సాయం కూడా పంపిస్తుండడం బర్రెలక్కకు కలిసి వచ్చే మరో మంచి పరిణామం అని చెప్పొచ్చు.

Also read:యోధుడిగా భక్త కన్నప్ప..ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్.

ఇది కేవలం రాజకీయాలు మాత్రమే అనుకుంటే పొరబడినట్టే. ఇదొక మంచి పరిణామం. మార్పుకోసం దారి అంటున్నారు విశ్లేషకులు. ప్రజల ఆలోచన మారుతోంది..రాజకీయాలు ఎవరబ్బ సొత్తు కాదు అని నిరూపించే సమయం ఆసన్నమైందన్న విషయం నిరూపితమవుతోందన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామం రాజకీయాలంటే దూరం పారిపోయే.. అబ్బే అవి మనకు కాదులే అనుకునే అనేక మందిలో మార్పు తెస్తుందని అనుకోవచ్చు. అక్రమార్కులు, బలవంతులు ప్రజాస్వామ్యాన్ని ఆక్రమించేసుకుని నిజాయితీ పరులు, సామాన్యులకు చోటు లేదని తేల్చేస్తున్న సమయంలో శిరిష లాంటి వారి ప్రయత్నం వారిలో ఆశలు రేపుతోంది. శిరీష గెలిస్తే అదో సంచలనం.. గెలవకపోయినా.. రాజకీయాల్లో ఎదగడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందని నిరూపించినట్లు అవుతుంది.

శిరీష బర్రెలక్కగా మారిందిలా..
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం పెద్దకొత్తపల్లిలో నిరుద్యోగ యువతి శిరీష. పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించి రాకపోవడంతో గేదెలను కొనుక్కుని జీవనం సాగిస్తోంది. 'ఉపాధి కోసం ఉద్యోగాలు ఇవ్వకుండా బర్రెలు, గొర్రెలు కొనుక్కొని జీవనోపాధి పొందాలని పాలకులు చెబుతున్నారు. నాకు ఉద్యోగం రాకపోవడంతో మా అమ్మ గేదెలను కొనిచ్చింది. ఉదయం, సాయంకాలం కలిపి ఆరు లీటర్ల పాలు ఇస్తాయి.. దీనితో నేను జీవనం సాగిస్తాను..' అంటూ నాలుగు గేదెలను చూపుతూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు.ఈ వీడియో వైరల్ అయింది. దాన్ని ఆసరాగా తీసుకునే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు బర్రెలక్క. తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయన్న పాలకుల మాటలు నీటి మూటలు అయ్యాయి. అందుకే పాలకుల కళ్ళు తెరిపించడానికి కొల్లాపూర్‌ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో తాను సైతం పోటీ చేస్తున్నానని శిరీష చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిరీషపై నియోజకవర్గమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. నిరుద్యోగులకు న్యాయం జరిగే దాకా తాను అలుపెరుగని పోరాటం చేస్తానని ఆమె చెప్తున్నారు. తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, నిరుద్యోగుల జీవన ప్రమాణాలను మార్చడానికే తన వంతు కృషి చేస్తున్నానన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు ప్రతినిధిగా తాను కొల్లాపూర్‌ శాసనసభకు నిలబడుతున్నానని శిరీష ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనను తాను బర్రెలక్క గానే ప్రమోట్ చేసుకుంటున్నారు శిరీష. వినూత్న ఎన్నికల ప్రచారంతో దూసుకుపోతున్న బర్రెలక్కకు యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు లక్ష రూపాయల విరాళం పంపించారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క ఎన్నికల ప్రచారం ప్రత్యర్థులను కొంత ఆందోళన పరుస్తోందనే చెప్పవచ్చును. ఆన్ లైన్ లో ఆమెకు మద్దతుగా ప్రచారం పెరుగుతోంది. దీనికి తోడు ప్రచారంలో బర్రెలక్క తమ్ముడి మీద దాడి జరిగింది. తరువాత ఆమె ఏడుస్తున్న వీడియో, మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆమె మరింత ఫేమస్ అయిపోయింది. దాంతో పాటూ సానుభూతి కూడా పెరిగిపోయింది. ఇవన్నీ కలిసి పోలింగ్ నాటికి బర్రెలక్క మీద మద్దతు సునామీ గా మారినా ఆశ్చర్యం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.

బర్రెలక్క పోటీ చేస్తున్న కొల్లాపూర్ నియోజవర్గంలో ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుకుంటే.. ఇక్కడ కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ నుంచి బీరం హర్షవర్ధన్ రెడ్డి బీజేపీ నుంచి ఏలేని సుధాకర్ రావు పోటీలో ఉన్నారు. జూపల్లి కృష్ణారావు ఇక్కడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఈయన మొదట స్వతంత్ర అభ్యర్ధిగా ఉండి గెలిచారు. ఆతరువాత బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. మళ్ళీ ఆ పార్టీ ఆయనకు కాకుండా బీరం హర్షవర్ధన్ రెడ్డికి సీటు ఇవ్వడంతో ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇక హర్షవర్ధన్ మొదట టీడీపీలో ఉన్నారు. తరువాత వైసీపీలో కొన్నాళ్ళు ఉన్నారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి వెంటనే బీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. అనేక పార్టీలు మారిన ఈ ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఉన్న అసంతృప్తి బర్రెలక్కకు కలిసి వస్తోందన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది. పైగా తెలంగాణలో నిరుద్యోగ యువత చాలా నిరుత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు అదే పాయింట్ ను మెయిన్ గా పట్టుకుని పోటీలోకి దిగుతోంది బర్రెలక్క. ఇది ఆమెకు చాలా పెద్ద అనుకూలించే అంశం అయ్యే అవకాశం ఉంది. బర్రెలక్కకు లభిస్తున్న మద్దతు ఆమెను విజయతీరాలకు చేరుస్తుందా? లేదా ఆమె చీల్చే ఓట్లు ఇతరుల గెలుపోటములను తారుమారు చేస్తుందా? అన్న అంశం డిసెంబర్ 3న తేలనుంది.

Advertisment
తాజా కథనాలు