/rtv/media/media_files/2025/09/09/navarro-2025-09-09-07-16-45.jpg)
Peter Navarro
ట్రంప్ వాణిజ్య సలహాదారు నవారో కు ప్రస్తుతం ఒక్కటే టార్గెట్. ఆయన దృష్టిలో భారత్ ఒక్కటే ఉంది. ఇండియా అమెరికాకు తలొగ్గేంత వరకూ విశ్రమించేదే లేదు అన్న శపథం పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు నవారో. వరుసపెట్టి భారత్ పై దాడులు చేస్తూనే ఉన్నారు. అమెరికాతో వాణిజ్య చర్చలపై ఇండియా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు.
భారత్ పై నవారో మరోసారి దండయాత్ర..
తాజాగా మరోసారి నవారో భారత్ పై దండయాత్ర చేశారు. రియల్ అమెరికాస్ వాయిస్ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో భారత ప్రభుత్వం విరుచుకుపడ్డారు. ఆ దేశాన్ని సుంకాల మహారాజుగా అభివర్ణించినందుకు తనపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. కానీ తాను అన్నది ముమ్మాటికీ నిజమని ఆయన అన్నారు. భారత్ అందరి కంటే అమెరికాపై ఎక్కువ టారిఫ్ లను విధిస్తోంది. దానిని తాము ఎదుర్కోవాలని నవారో అన్నారు. అలాగే ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం మొదలుపెట్టక ముందు భారత్ ఎప్పుడూ ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేయలేదు. ఇప్పుడు చమురు కొనుగోలు చేస్తున్నది కూడా అధిక లాభాల కోసమే అంటూ నవారో మరోసారి విమర్శించారు. దీని వలన ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని వారు పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు.
భారత్ వీలైనంత తొందరగా అమెరికాతో ఒప్పందం చేసుకుంటే మంచిదని పీటర్ నవారో అన్నారు. యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలు ఇప్పటికే అమెరికాతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలను చేసుకున్నాయి. అలాగే భారత్ కూడా చేసుకోవాలని నవారో చెప్పారు. ఈ విషయంలో ఆ దేశం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నానని అన్నారు. అలా చేయకుండా రష్యా, చైనాలతో పొత్తు పెట్టుకుంటే మాత్రం భారత్ కు అస్సలు మంచిది కాదని నవారో హెచ్చరించారు. అలాగే రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేసే చైనాపై అదనపు ఆంక్షలపై నవారో మాట్లాడుతూ..ఆ దేశంతో తమకు మంచి డీలింగ్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక్కడ కేవలం భారత్..రష్యా నుంచి చమురు కొనడం మానేయడమే తమకు కావాలని స్పష్టం చేశారు.
అంతకు ముందు నవారో చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అబద్ధమని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ 'ఫ్యాక్ట్‌చెక్' వెల్లడించింది. ఈ వ్యవహారంపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. ఎవరు తప్పు చేసినా కూడా ఎక్స్ కమ్యూనిటీ నోట్స్ దాన్ని సరిచేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదని తేల్చిచెప్పారు. గ్రోక్ మరింత ఫ్యాక్ట్‌చెక్ సమాచారాన్ని ప్రజలు అందిస్తోందని చెప్పారు. భారత్ ఎలాంటి ఆంక్షలు ఉల్లంఘించలేదని తేల్చిచెప్పింది. అంతేకాదు అమెరికా కూడా రష్యా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటోందని పేర్కొంది. నవారో చేసిన వ్యాఖ్యలు కపటమైనవిగా ఉన్నాయని పేర్కొంది. దీనిపై స్పందించిన నవారో ఎక్స్‌పై విరుచుకుపడ్డారు. ఎలాన్‌మస్క్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ ఫ్యాక్ట్‌చెక్ ఇచ్చిన సమాచారాన్ని ఒక చెత్త అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.