President Trump: మూడో టర్మ్ లోనూ ట్రంప్ పోటీ? జోరుగా ఊహాగానాలు..

ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మూడోసారి కూడా పోటీ చేసేందుకు సిద్ధమవ్వడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. స్వయంగా అధ్యక్షుడే ఈ విషయం చెప్పడం గమనార్హం. నేను అలా చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. 

New Update
trump president

అమెరికా అధ్యక్షుడు ట్రంప్..2028లో మరో పదవీ కాలాన్ని ప్రయత్నించవచ్చనే ఊహాగానాలకు మరోసారి తెరలేచింది. ఈ రోజు మీడియా సమావేశంలో ట్రంప్ చెప్పిన మాటలే ఈ ఊహాగానాలు చెలరేగేలా చేశాయి. ఉపాధ్యక్ష పదవికి అయితే కచ్చితంగా పోటీ చేయనని చెప్పిన  ట్రంప్..మూడోసారి అధ్యక్ష పదవిని కొనసాగించడంపై మాత్రం మాట దాటవేశారు. అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేసే అవకాశం గురించి అడిగినప్పుడు..తాను అలా చేయాలనే అనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. తాను గెలవడానికి చాలా అవకాశాలున్నాయని...దానికి సంబంధించిన డేటా కూడా తన దగ్గర ఉందని ట్రంప్ అన్నారు. కాబట్టి మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడాన్ని తాను తోసి పుచ్చలేనని చెప్పారు. 

అవకాశం లేకపోలేదు..

అయితే ఇప్పుడే తాను దాని గురించి ఆలోచించడం లేదని అన్నారు ట్రంప్. 2028 ఎన్నికలకు పోటీదారులుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కూ రూబియోలు సిద్ధంగా ఉన్నారని.. వారిని దాటుకుని వెళ్ళడం కష్టమని చెప్పుకొచ్చారు. దీనిపై రిపబ్లికన్ పార్టీలో ఎప్పుడైనా సమావేశం జరిగితే..వారికే ఎక్కువ ఓట్లు వస్తాయని స్పష్టం చేశారు. దానికి తోడు చట్టపరిమితులను కోర్టులో సవాల్ చేయడం కూడా చాలా విషయమని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు అవన్నీ ఆలోచించే దృష్టి తనకు లేదని అన్నారు. మరోవైపు ట్రంప్ తన రెండవ పదవీ కాలం ముగించే సమయానికి అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా ఉంటారు. దానికి తోడు ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు మూడుసార్లు పోటీ చేయలేదు. అంతేకాదు యూఎస్ రాజ్యాంగపరంగా అలా చేయడం విరుద్ధం కూడా. అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ఏ అధ్యక్షుడైనా మూడవసారి పదవి నిషేధిస్తుంది. 

అయితే అధ్యక్షుడు ట్రంప్ మూడోసారి పోటీ గురించి మాట్లాడ్డం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకు ముందు కూడా ఒకటి రెండు సార్లు ఆయన దీనికి సంబంధించిన వ్యాఖ్యలను చేశారు. 2028లో పెద్ద బాల్ రూమ్ ను నిర్మించాలనే ట్రంప్ నిర్ణయం.. తన పదవీ విరమణ తర్వాత కూడా వైట్ హౌస్ ను విడిచి పెట్టరనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. అంతేకాదు ట్రంప్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బానన్ కూడా ఆయనను మరోసారి అధ్యక్షుడిగా నియమించేందుకు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. అయితే అమెరికా రాజ్యాంగంలో 22వ సవరణను రద్దు చేయడానికి చేసే ఏ ప్రయత్నానికైనా ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ మూడింట రెండు వంతుల ఆమోదం లేదా రాష్ట్ర శాసనసభలలో మూడింట రెండు వంతుల అంగీకారం కచ్చితంగా ఉండాలి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని విశ్లేషకులు చెబుతున్నారు.   

Advertisment
తాజా కథనాలు