/rtv/media/media_files/2025/10/22/tomahawk-2025-10-22-20-16-43.jpg)
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ఆపాలని అమెరికా ఎంత చెప్పినా రష్యా వినడం లేదు.. ఇప్పటికే చాలాసార్లు శాంతి చర్చలు జరిగినా ఫలితం దక్కలేదు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అస్సలు వెనుకడుగు వేయడం లేదు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం ఆపడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అయినా రష్యా ఉక్రెయిన్‌పై దాడులు చేయడం మానుకోవట్లేదు. దీంతో ట్రంప్ ప్లాన్ బీతో ముందుకు వచ్చాడు. మొదటి నుంచి ఉక్రెయిన్‌కు తెరవెనుక మద్దతుగా ఉన్న అమెరికా.. ఇప్పుడు బహిరంగంగానే యుద్ధంలో ఉక్రెయిన్‌కు సపోర్ట్‌గా నిలుస్తోంది. ఆ దిశగా అమెరికా నేవీలోని పవర్‌ఫుల్ క్షిపణి ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
టొమాహాక్ అనేది అమెరికా నావికాదళం ఉపయోగించే దీర్ఘ-శ్రేణి, సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీనిని 1970లలో అభివృద్ధి చేశారు. యుద్ధనౌకలు లేదా జలాంతర్గాముల నుండి ప్రయోగించే ఈ క్షిపణులు దాదాపు 1,600 కిలోమీటర్ల (1,000 మైళ్లు) దూరం వరకు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలవు. సముద్ర మట్టానికి కేవలం 30-35 మీటర్ల ఎత్తులో ప్రయాణించడం వలన రాడార్లకు చిక్కడం కష్టం. దీనిలో జీపీఎస్, ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థలు ఉంటాయి. మార్గమధ్యలో కూడా లక్ష్యాన్ని మార్చే సామర్థ్యం వీటికి ఉంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు, రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ టొమాహాక్ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇచ్చే ఆలోచనను వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో ఉన్న ఈ విధ్వంసక ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఇస్తే, రష్యాలోని కీలక సైనిక స్థావరాలు, సరఫరా కేంద్రాలపై దాడులు చేయగల సామర్థ్యం కీవ్‌కు లభిస్తుంది. దీంతో చర్చల ద్వారా యుద్ధాన్ని ఆపేందుకు మాస్కో అంగీకరించే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు.
టొమాహాక్‌లను సరఫరా చేయాలనే ట్రంప్ ఆలోచనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్య అమెరికా-రష్యా సంబంధాలను నాటకీయంగా దెబ్బతీస్తుందని, ఉద్రిక్తతలను పెంచుతుందని క్రెమ్లిన్ హెచ్చరించింది. దీర్ఘ-శ్రేణి క్షిపణులను అణు వార్‌హెడ్‌గా కూడా పరిగణించాల్సి వస్తుందని రష్యా పేర్కొంది.