/rtv/media/media_files/2026/01/01/trump-2026-01-01-13-12-36.jpg)
Trump
వెనిజులా అధ్యక్షుడిని బంధించి, ఆ దేశంపై పెత్తనం చెలాయిస్తున్న ట్రంప్ కన్ను నెక్ట్స్ ఇరాన్‌పై పడింది. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్‌లో రాజకీయ అస్థిరతను అదునుగా చూసుకొని ఆ దేశ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీని అధికారం నుంచి తప్పించి అమెరికా చెప్పినట్లు వినే వారికి అధికారం కట్టబెట్టనుంది. ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రజలకు సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ అన్నారు. అక్కడి ప్రజలు ఎన్నడూ లేని విధంగా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్నారని, వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.
ట్రంప్ హెచ్చరిక: 'మేము సిద్ధంగా ఉన్నాం'
గత కొన్ని రోజులుగా ఇరాన్‌లోని వందలాది నగరాల్లో నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి. ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో "ఇరాన్ స్వేచ్ఛ వైపు చూస్తోంది. బహుశా గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఆకాంక్ష బలంగా ఉంది. వారికి సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది" అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న పౌరులపై ఇరాన్ భద్రతా దళాలు కాల్పులు జరిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. "ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను చంపడం ప్రారంభిస్తే, మేము వారి రక్షణకు వస్తాం. మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం" అని ట్రంప్ ఘాటుగా స్పందించారు.
ఇరాన్‌లో కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడం, పెరిగిన నిత్యావసర ధరలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల సామాన్య ప్రజలు వీధుల్లోకి వచ్చారు. డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమైన ఈ ఆందోళనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 400 ప్రాంతాలకు విస్తరించాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు సుమారు 150 మందికి పైగా నిరసనకారులు మరణించినట్లు సమాచారం. పరిస్థితిని అదుపు చేయడానికి ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించారు. అమెరికా తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోందని, విదేశీ శక్తుల ప్రేరణతోనే ఈ అల్లర్లు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అమెరికా జోక్యం చేసుకుంటే ఆ ప్రాంతం మొత్తం అస్థిరతకు లోనవుతుందని ఇరాన్ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం, నిరసనకారుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో, అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. అమెరికా మరియు ఇరాన్ మధ్య దౌత్యపరమైన యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.
Follow Us