/rtv/media/media_files/2025/12/05/fotojet-2025-12-05t090722932-2025-12-05-09-07-43.jpg)
Tovorag.. our quail eggs
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత పర్యటనకు విచ్చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత మన దేశానికి వస్తున్న పుతిన్.. పర్యటనలో భాగంగా పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి ప్రైవేట్ డిన్నర్ కూడా చేయనున్నారు. దీంతో రష్యా అధ్యక్షుడు అసలు ఏం తింటారు. ఎలాంటి తిండి ఇష్ట పడుతారు అనే విషయంపై అనేక రకాల చర్చ కొనసాగుతోంది. ఆయన డైలీ ఫుడ్ రొటీన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే పుతిన్ ఆహారపు అలవాట్లపై చర్చ కొనసాగుతోంది. ఇంతకు ఆయన ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసుకుందాం..
పుతిన్ ఎక్కువగా తేలికగా జీర్ణమయ్యే, సంప్రదాయ వంటకాలను ఇష్టపడతారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో రష్యాలో పాపులర్ అయిన టోవోరాగ్ అనే వంటకం తింటారు. దీన్ని కాటన్ చీజ్, తేనె కలిపి తయారు చేస్తారు. దీంతోపాటు కౌజుపిట్ట గుడ్లు, తాజా పళ్లతో చేసే జ్యూస్ తీసుకుంటారు. ప్రొటీన్ కోసం చేపలను ఎక్కువగా తింటారని పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. స్టర్‌జియన్ చేప, గొర్రె పిల్ల మాంసం అంటే పుతిన్‌కు చాలా ఇష్టమట. చక్కెరతో చేసే పదార్థాలకు ఆయన చాలా దూరంగా ఉంటారు. డెజర్ట్‌లపై అంతగా ఆసక్తి చూపరని తెలుస్తోంది. వాటికి బదులుగా టమోటాలు, దోసకాయలు వంటి కూరగాయలతో చేసే సలాడ్‌లను ఎక్కువగా తీసుకుంటారు. చాలా అరుదుగా ఐస్‌క్రీమ్, పేస్ట్రీలు వంటివి తింటారట. అధికారిక డిన్నర్లలో ఎక్కువగా చేపలతో చేసే సూప్, మాంసాహారానికి ప్రాధాన్యమిస్తారని ఆంగ్ల మీడియా కథనాలు తెలిపాయి.
2014లో పుతిన్ భారత్‌కు వచ్చినప్పుడు నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కశ్మీరీ సంప్రదాయ వంటకాలతో రష్యా అధ్యక్షుడికి విందు ఏర్పాటు చేశారు. కుంకుమపువ్వుతో చేసే పానీయం, పాలకూరతో తయారుచేసిన హాక్ కా సాగ్‌తో పాటు గులాటీ కబాబ్, ముర్గ్ ధనివాల్ కుర్మా, బాదాం షోర్బా, గులాబ్ ఖీర్, చీజ్ కేక్ వంటివి ఆయనకు వడ్డించారు.
ఇక, 2018 నాటి పర్యటన సందర్భంగా పుతిన్ కోసం ప్రత్యేకంగా వెజిటేరియన్, నాన్ వెజ్ వంటకాలను ఏర్పాటు చేశారు. అందులో సాల్మాన్ ఫిల్లెట్, మొఘలాయ్ స్టైల్‌లో చేసిన గొర్రె మాంసం, చికెన్ వెరైటీలు, వాటర్‌మిలన్ క్రీమ్ సూప్, మొలకెత్తిన గింజలతో చేసిన పఫ్, కబాబ్, రికోటా సిల్వర్ పెరల్స్ వంటి డిషెస్ కూడా ఆయన కోసం ఏర్పాటు చేశారు. అయితే, వీటిని పుతిన్ తిన్నారా? లేదా అనేది తెలియదు. సాధారణంగా విదేశీ పర్యటనల్లో పుతిన్ చుట్టూ కఠినమైన భద్రతా ప్రొటోకాల్ ఉంటుంది. పుతిన్ తీసుకునే ఆహారంలో విష పదార్థాలేమైనా కలిశాయా అని గుర్తించేందుకు విదేశాల్లో ఆయన వెంట వ్యక్తిగత ప్రయోగశాల ఎప్పుడూ ఉంటుంది. విదేశాల్లో హోటల్ స్టాఫ్ సేవలను ఆయన వాడుకోరు. ఆయన కోసం రష్యా నుంచే చెఫ్‌లు, హౌస్‌కీపింగ్ సిబ్బంది వస్తారు.
Follow Us