క్షిపణి, అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేసే ప్రకటనలపై దక్షిణ కొరియా ఘాటుగా స్పందించింది. అణ్వాయుధ ప్రయోగాలకు యత్నిస్తే.. తగిన రీతితో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డే సందర్భంగా మంగళవారం సియోల్‌లో శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణి హ్యున్‌మూ-5 సహా అధునాతన 340 రకాల ఆయుధాలను ప్రదర్శించింది. పరేడ్‌కు హాజరైన పలువులు ప్రముఖులు, వేలాదిమంది జవాన్లను ఉద్దేశించి సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: మరో వివాదంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య!
పాలకులకు అదే చివరి రోజు
మాపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు ఉత్తరకొరియా యత్నిస్తే.. మా సైన్యం, ఊహించని రీతిలో దీటైన సమాధానమిస్తుంది. ఉత్తర కొరియా పాలకులు అదే చివరిరోజు అవుతుంది. తమను కాపాడేది అణ్వాయుధాలేనన్న భ్రమను ఉత్తర కొరియా పాలకులు వదిలేయాలని హెచ్చరించారు. ఇదిలాఉండగా.. హ్యూన్‌మూ-5 మిసైల్ 8 టన్నుల భారీ వార్‌హెడ్‌ను కలిగి ఉంటుంది. భూమి లోపలి అండర్‌గ్రౌండ్ బంకర్లను కూడా నాశనం చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. ఈ క్షిపణిని మొదటిసారిగా దక్షిణ కొరియా ప్రదర్శించింది.
పరేడ్ సమయంలో అమెరికా లాంగ్ రేంజ్ బి-1బీ బాంబర్‌తో సహా దక్షిణ కొరియా అత్యాధునిక ఫైటర్ జట్లు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టాయి. అయితే దక్షిణ కొరియా వద్ద అణ్వాయుధాలు లేవు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమాన్ని ధీటుగా ఎదుర్కొనే లక్ష్యంతోనే సౌత్ కొరియా.. స్ట్రాటజిక్ కమాండ్ సెంటర్‌ను సైతం ప్రారంభించింది. ఇదిలాఉండగా.. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య దశాబ్దాల కాలంగా వైరుధ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్తర కొరియాలో వరదలు వచ్చినప్పుడు కూడా దక్షిణ కొరియా తాము సాయం చేస్తామని ప్రకటించింది. కానీ కిమ్ ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.