అమెరికాని అడ్డుకోవడానికి ఏకమైన ఏడు దేశాలు.. గ్రీన్‌లాండ్‌కి తోడుగా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని దక్కించుకోవాలని ఆయన కోరిక బయటపెట్టారు. వెనిజులాలో అమెరికా జరిపిన సైనిక చర్యల నేపథ్యంలో ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

New Update
Greenland

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని దక్కించుకోవాలని ఆయన కోరిక బయటపెట్టారు. వెనిజులాలో అమెరికా జరిపిన సైనిక చర్యల నేపథ్యంలో ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో జర్మనీ, ఫ్రాన్స్ సహా ఏడు ఐరోపా దేశాలు అమెరికాని అడ్డుకునేందుకు ఏకమయ్యాయి.

డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ.. అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్‌లాండ్ తమకు చాలా అవసరమని, ఆ ప్రాంతాన్ని తాము రక్షించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. "గ్రీన్‌లాండ్ చుట్టూ రష్యా, చైనా నౌకలు తిరుగుతున్నాయి. డెన్మార్క్ దానిని రక్షించలేదు, మాకు అది ఖచ్చితంగా కావాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్ ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండటం, అక్కడ అపారమైన ఖనిజ సంపద ఉండటం ట్రంప్ అలా మాట్లాడటానికి ప్రధాన కారణం.

ఏడు దేశాల కూటమి

ట్రంప్ వ్యాఖ్యలను డెన్మార్క్ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. డెన్మార్క్‌కు మద్దతుగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, డెన్మార్క్ దేశాలు కలిసి ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. గ్రీన్‌లాండ్ డెన్మార్క్ రాజ్యంలో అంతర్భాగమని, దాని భవిష్యత్తును నిర్ణయించే అధికారం కేవలం అక్కడ నివసించే ప్రజలకు, డెన్మార్క్‌కు మాత్రమే ఉందని ఈ దేశాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ సరిహద్దులను బలవంతంగా మార్చడం అంగీకారం కాదని, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను అమెరికా గౌరవించాలని డిమాండ్ చేశాయి. ఒక నాటో మిత్ర దేశంపై ఇలాంటి బెదిరింపులకు దిగడం వల్ల ఈ అంతర్జాతీయ కూటమి అస్థిరపడే ప్రమాదం ఉందని జర్మనీ, ఫ్రాన్స్ హెచ్చరించాయి.

ఉద్రిక్తతలకు కారణమైన 'కేటీ మిల్లర్' పోస్ట్
ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ భార్య, కేటీ మిల్లర్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఈ వివాదాన్ని మరింత రాజేసింది. గ్రీన్‌లాండ్ మ్యాప్‌పై అమెరికా జెండాను ముద్రించి "త్వరలో" అని క్యాప్షన్ పెట్టారు. దీనిపై గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్-ఫ్రెడరిక్ నీల్సన్ స్పందిస్తూ.. "మా దేశం ఎవరికీ అమ్మకానికి లేదు, ఇలాంటి అవమానకరమైన పోస్టులను ఆపండి" అని ఘాటుగా సమాధానమిచ్చారు.

ప్రస్తుతం అమెరికా, ఐరోపా దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్లిష్టంగా మారాయి. ట్రంప్ తన మొండి వైఖరిని కొనసాగిస్తారా లేదా మిత్రదేశాల ఒత్తిడికి తలొగ్గుతారా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisment
తాజా కథనాలు