S-500 Prometheus: ఇది మన చేతికి వస్తే చైనా, పాకిస్థాన్‌లకు చుక్కలే!

అమెరికా రహస్య యుద్ధ విమానాలను కూడా నేలమట్టం చేయగలిగే లెటెస్ట్ టెక్నాలజీని రష్యా తయారు చేసింది. అధునాతన ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-500 ప్రొమేథియస్ అధికారికంగా రంగంలోకి దిగింది. ఈ పవర్ ఫుల్ టెక్నాలజీ భారత్‌కు ఎగుమతి చేసే అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి.

New Update
S500

అమెరికా రహస్య యుద్ధ విమానాలను కూడా నేలమట్టం చేయగలిగే లెటెస్ట్ టెక్నాలజీని రష్యా తయారు చేసింది. రష్యాకు చెందిన అత్యంత శక్తివంతమైన, అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-500 ప్రొమేథియస్ అధికారికంగా రంగంలోకి దిగింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన మొదటి రెజిమెంట్‌ను రష్యా రక్షణ దళాలు విజయవంతంగా మోహరించాయి. దీనితో పాటు, ఈ పవర్ ఫుల్ టెక్నాలజీ భారత్‌కు ఎగుమతి చేసే అంశంపై కూడా ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి.

రష్యా రక్షణ కవచంలో సరికొత్త శక్తి S-500 ప్రొమేథియస్ కేవలం విమానాలను మాత్రమే కాకుండా, అంతరిక్షం నుంచి వచ్చే ముప్పులను కూడా అడ్డుకోగలదు. మాస్కో, రష్యాలోని కీలక పారిశ్రామిక ప్రాంతాలను రక్షించేందుకు మొదటి S-500 రెజిమెంట్‌ను మోహరించారు.

సామర్థ్యం: ఇది భూమికి 200 కిలోమీటర్ల ఎత్తులో (నియర్ స్పేస్) ప్రయాణించే శత్రు లక్ష్యాలను గుర్తించి నాశనం చేయగలదు. ఐసిబిఎంలు (ICBMs), హైపర్‌సోనిక్ క్షిపణులు, భూమికి దగ్గరగా ఉన్న ఉపగ్రహాలను కూల్చివేయడం దీని ప్రత్యేకత. సెకనుకు 7 కిలోమీటర్ల వేగంతో వచ్చే లక్ష్యాలను కూడా ఇది నాశనం చేస్తుంది.

భారత్‌తో ఎగుమతి చర్చలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవలి భారత పర్యటన నేపథ్యంలో, S-500 వ్యవస్థను భారత్‌కు విక్రయించే విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా తన సొంత అవసరాలు తీరిన తర్వాత, ఈ అత్యాధునిక వ్యవస్థను పొందే తొలి విదేశీ భాగస్వామి భారత్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే S-400 (సుదర్శన చక్ర) ఒప్పందంతో ఇరు దేశాల మధ్య రక్షణ బంధం బలపడింది. S-500 క్షిపణులను కేవలం కొనుగోలు చేయడమే కాకుండా, వాటి విడిభాగాలను భారత్‌లోనే తయారు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి.ప్రస్తుతానికి ఈ సాంకేతికత చైనా వద్ద కూడా లేదు. ఒకవేళ భారత్ దీనిని సాధిస్తే, సరిహద్దుల్లో వ్యూహాత్మక ఆధిపత్యం భారత్ సొంతమవుతుంది.

వ్యూహాత్మక ప్రాముఖ్యత
ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400 చూపిన ప్రతిభను దృష్టిలో ఉంచుకుని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ S-500పై అమితాసక్తి చూపుతోంది. ఇది అందుబాటులోకి వస్తే పాకిస్తాన్, చైనాల నుంచి ఎదురయ్యే హైపర్‌సోనిక్ క్షిపణుల ముప్పును భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలదు. అయితే, ఈ ఒప్పందం కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. రష్యా ప్రస్తుతం తన సొంత రక్షణ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో, 2030 నాటికి ఈ వ్యవస్థలు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు