/rtv/media/media_files/2026/03/05/attack-on-israel-2026-03-05-14-52-35.jpg)
మధ్యప్రాచ్యంలో యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఇజ్రాయెల్‌పై దాడుల్లో ఇరాన్ మొదటిసారిగా డేంజరస్ 'క్లస్టర్ బాంబు' వార్హెడ్లను కలిగిన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది రష్యా, చైనా దేశాలు. అయితే ఇరాన్ క్లస్టర్ బాంబు వార్‌హెడ్ ప్రయోగించడం వెనుక ఆ దేశాల సహకారం ఉందా అనే సందేహాలు వస్తున్నాయి.
ఏమిటీ క్లస్టర్ బాంబుల ప్రత్యేకత?
సాధారణ క్షిపణులు ఒకే చోట పేలి నష్టాన్ని కలిగిస్తాయి. కానీ, క్లస్టర్ బాంబులు గాలిలోనే పేలి, తమలో ఉన్న పదుల సంఖ్యలో చిన్న బాంబులను (సబ్‌మ్యూనిషన్స్) ఒకేసారి పెద్ద విస్తీర్ణంలో చల్లుతాయి. ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన క్షిపణి నేలను తాకడానికి 4 నుండి 7 కిలోమీటర్ల ముందే గాలిలో పేలి, సుమారు 20 చిన్న బాంబులను విడుదల చేసింది. ఇవి 5 నుండి 8 కిలోమీటర్ల మేర విస్తరించి పౌర నివాసాలపై పడుతున్నాయి.
రష్యా, చైనా వైపు మళ్లుతున్న చూపు
ఇరాన్ ఇంతటి లెటెస్ట్ మిస్సైల్ సామర్థ్యాన్ని, క్లస్టర్ వార్‌హెడ్ సాంకేతికతను స్వయంగా అభివృద్ధి చేసిందా లేక ఇతర దేశాల సహాయం తీసుకుందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ ఆయుధాల తయారీలో రష్యా లేదా చైనా సైన్యాల ప్రమేయం ఉండవచ్చని ఇజ్రాయెల్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఇటువంటి ఆయుధాలను వాడిన దాఖలాలు ఉండటంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ప్రస్తుతం ఇరాన్ తన క్లస్టర్ ఆయుధాల సామర్థ్యాన్ని సీక్రెట్‌గా ఉంచుతోంది. ఈ కొత్త రకం దాడులు యుద్ధ పరిస్థితి మార్చడమే కాకుండా, ఇకముందు ప్రాణనష్టాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం
మార్చి 3న ఇరాన్ 6 క్షిపణులను ప్రయోగించగా, అంతకుముందు ఫిబ్రవరి 28 నుండి జరిగిన దాడుల్లో కనీసం 11 మంది మరణించారని, 1,000 మందికి పైగా గాయపడ్డారని NBC న్యూస్ వెల్లడించింది. టెల్ అవీవ్ సమీపంలోని అజోర్ నగరంలో ఒక ఇల్లు ఈ క్లస్టర్ బాంబుల వల్ల తీవ్రంగా దెబ్బతింది. పట్టణ ప్రాంతాల్లో వీటిని అడ్డగించడం గాలిలో పేలడం వల్ల రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతోంది.
అంతర్జాతీయ ఒప్పందాలు ఉల్లంఘనలు
క్లస్టర్ ఆయుధాల వల్ల పౌరులకు కలిగే ముప్పు దృష్ట్యా, 2008లో 100కు పైగా దేశాలు వీటి వినియోగంపై నిషేధ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్రస్తుతం 111 దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. అయితే, ఆశ్చర్యకరంగా ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా మరియు రష్యా కూడా ఈ ఒప్పందంలో చేరలేదు.
Follow Us