Nepal Floods: నేపాల్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలు, అలాగే కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు సుమారు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదల వల్ల సుమారు 60 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారని సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో వందలాది మంది గల్లంతయ్యారు. గురువారం నుంచి నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విపత్తు అధికారులు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు.
నేపాల్ పోలీసు డిప్యూటీ అధికార ప్రతినిధి బిశ్వ అధికారి ప్రకారం, వర్షం కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఖాట్మండు లోయ ఒకటి. ఇక్కడ మాత్రమే ఏకంగా 34 మంది మరణించారు. ఇది కాకుండా, చాలా మంది గల్లంతయ్యారు. వందల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. ఖాట్మండు వ్యాలీలో 16 మంది గల్లంతవ్వగా, దేశవ్యాప్తంగా తప్పిపోయిన వారి సంఖ్య 100కి పైగా చేరుకుంది. ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా ప్రజలను రక్షించినట్లు నేపాల్ పోలీసు డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ బిశ్వా అధికారి పేర్కొన్నారు.
ఇది కాకుండా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో, దేశవ్యాప్తంగా 63 చోట్ల ప్రధాన రహదారులు మూసి వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇది రవాణా వ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి, పట్టణాభివృద్ధి మంత్రి ప్రకాష్ మాన్ సింగ్.. హోం మంత్రి, హోం కార్యదర్శి, భద్రతా సంస్థల అధిపతులు ఇంకా ఇతర మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నేపాల్‌లోని అన్ని పాఠశాలలను మూడు రోజుల పాటు మూసివేయాలని, అన్ని పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: నస్రల్లా హత్య న్యాయమైన చర్య: బైడెన్!