/rtv/media/media_files/2025/08/22/max-app-2025-08-22-20-36-08.jpg)
MAX app
రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వాడకంలో చైనా దారిలోనే వెళ్తోంది పుతిన్ గవర్నమెంట్. దేశంలో విదేశీ మెసేజింగ్ యాప్‌ల వినియోగాన్ని తగ్గించి, దేశీయ యాప్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో 'మ్యాక్స్' అనే మెసేజింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 1 నుంచి రష్యాలో విక్రయించే అన్ని కొత్త ఫోన్‌లు, టాబ్లెట్‌లలో 'మ్యాక్స్' యాప్‌ను తప్పనిసరిగా ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనా కూడా వాట్సాప్‌ను బ్యాన్ చేసి వి చాట్ అనే యాప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లకు సవాలుగా మారింది. రష్యా ప్రభుత్వం ఈ యాప్‌లను దేశంలో సురక్షితమైనవిగా పరిగణించడం లేదు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత, రష్యా ప్రభుత్వం తన డిజిటల్ కమ్యూనికేషన్స్‌పై నియంత్రణను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగానే, విదేశీ యాప్‌లకు బదులుగా దేశీయ యాప్‌లను ప్రోత్సహిస్తోంది.
🇷🇺 BREAKING:
— SVS NEWS AGENCY (@svsnewsagency) August 22, 2025
Russia orders state-backed Max messenger app to be pre-installed on all smartphones sold in the country. pic.twitter.com/vp9I9aYZsx
'మ్యాక్స్' యాప్‌ను రష్యాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ వీకే (VK) అభివృద్ధి చేసింది. ఈ యాప్ కేవలం మెసేజింగ్ సేవలను మాత్రమే కాకుండా, ప్రభుత్వ సేవలతో కూడా అనుసంధానించబడి ఉంటుంది. దీనివల్ల పౌరులు ఒకే యాప్ ద్వారా అనేక రకాల సేవలను పొందే అవకాశం ఉంది. అయితే, ఈ నిర్ణయంపై సెక్యురీటీ సమస్యలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ యాప్ ద్వారా ప్రజల సమాచారాన్ని నిఘా పెట్టే అవకాశం ఉందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాప్ డెవలపర్లు ఈ ఆరోపణలను ఖండిస్తూ, మ్యాక్స్ యాప్‌కు వాట్సాప్, టెలిగ్రామ్ కంటే తక్కువ అనుమతులు మాత్రమే అవసరమని, అందువల్ల ఇది మరింత సురక్షితమైనదని వాదిస్తున్నారు.
ప్రస్తుతం రష్యాలో వాట్సాప్, టెలిగ్రామ్ బాగా ప్రాచుర్యం పొందాయి. సుమారు 97.3 మిలియన్ల మంది రష్యన్లు వాట్సాప్‌ను ఉపయోగిస్తుండగా, టెలిగ్రామ్‌ను 90.8 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. అయితే, కొత్తగా తీసుకువచ్చిన చట్టంతో, ఈ సంఖ్యల్లో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. మ్యాక్స్ యాప్ ఇప్పటికే 18 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను సాధించిందని సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం రష్యాలో డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ఒక కీలక మార్పును తీసుకువస్తుందని నిపుణులు భావిస్తున్నారు.