/rtv/media/media_files/2025/10/15/amazon-2025-10-15-17-20-14.jpg)
Amazon plans major layoffs
Amazon layoffs: అనేక కారణాలతో కార్పొరేట్ ఉద్యోగుల తొలగింపునకు అమెజాన్ సంస్థ సిద్ధమైంది. సుమారు 30 వేల మంది ఉద్యోగులు ఈ దఫా లేఆఫ్స్‌లో జాబ్ కోల్పోనున్నట్లు తెలుస్తోంది. వేలాది మంది కార్పొరేట్ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు ఆ కంపెనీ సిద్ధమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అది కూడా ఈ వారం నుంచే తొలగింపులు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అమెజాన్‌లో సుమారు3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో ఈసారి ఏకంగా 10 శాతం మంది జాబ్ కోల్పోయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2020 తరువాత కంపెనీలో ఇంత పెద్ద స్థాయిలో లేఆఫ్స్ జరగడం ఇదే తొలిసారని టెక్ వర్గాలు చెబుతున్నాయి. తొలగింపులకు సంబంధించి మంగళవారం నుంచి ఈమెయిల్స్ ద్వారా సంబంధిత ఉద్యోగులకు సమాచారం తెలియజేస్తారని తెలుస్తోంది.
ఈసారి అమెజాన్ సంస్థకు చెందిన అనుబంధ విభాగాల్లోనూ ఈ కోతలు ఉండనున్నాయని తెలుస్తోంది. మానవవనరుల విభాగం, ఆపరేషన్స్, డివైజెస్, సర్వీసులు, అమెజాన్ వెబ్ సర్వీసుల్లో పనిచేస్తున్న కార్పొరేట్ ఉద్యోగులు ఉద్వాసనకు గురికానున్నారని ప్రచారం సాగుతోంది. మానవ వనరుల విభాగంలో ఈసారి 15 శాతం మంది తమ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
కరోనా సంక్షోభ సమయంలో అమెజాన్ భారీ స్థాయిలో నియామకాలు చేపట్టింది. దీంతో ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగులు పెరిగి పోయారు.దీనితో దిద్దుబాటు చర్యల్లో భాగంగా అమెజాన్ ఈ తొలగింపులకు సిద్ధమవుతోంది. కంపెనీలో అధికార గణాన్ని తగ్గించాలన్న సీఈఓ యాండీ జెస్సీ యోచనలో భాగంగా ఈ లేఆఫ్స్ జరుగుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సంస్థలో మేనేజర్ల సంఖ్యను కుదించాలన్న యోచనలో సీఈఓ ఉన్నారని చెబుతున్నారు. మరోవైపు మానవవనరుల స్థానంలో ఏఐని వినియోగించుకునేందుకు కూడా అమెజాన్ సిద్ధమైంది. ఏఐ వినియోగం పెరిగే కొద్దీ మరిన్ని తొలగింపులు ఉంటాయని కూడా సీఈఓ ఇటీవల సంకేతాలివ్వడం గమనార్హం. అయితే కార్పొరేట్ విభాగ పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్నప్పటికీ ఈ హాలిడే సీజన్‌లో చాలా మందికి అమెజాన్ తాత్కాలిక ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా ఈ సీజన్‌లో సుమారు 2. 50 లక్షల మందికి సంస్థలో జాబ్ లభించే అవకాశం ఉంది. పండుగ సీజన్‌లో పెరిగే రద్దీని తట్టుకునేందుకు, వేర్ హౌస్ కార్యకలాపాల కోసం సంస్థ తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
Follow Us