Ali Khamenei : 35 ఏళ్ల పాలన..ఇరాన్‌ను శాసించిన అలీ ఖమేనీ ప్రస్థానం ఇదే!

ఇజ్రాయెల్‌-అమెరికా కలిసి సంయుక్తంగా చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.

New Update
Ali Khamenei

ఇజ్రాయెల్‌-అమెరికా కలిసి సంయుక్తంగా చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది. అయితే ఖమేనీతో పాటు అతని కుమార్తె, మనవరాలు, అల్లుడు కూడా మృతి చెందినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. 

అలీ ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాన్‌లోని పవిత్ర నగరం మషద్‌లో జన్మించారు. ఒక సాధారణ మత గురువుల కుటుంబంలో ఎనిమిది మంది సంతానంలో రెండోవాడిగా ఆయన పుట్టారు. చిన్నతనం నుంచే మతపరమైన విద్యను అభ్యసించిన ఆయన, తర్వాతి కాలంలో ఇరాన్ ఇస్లామిక్ విప్లవ పితామహుడు అయతుల్లా ఖొమేనీకి అత్యంత సన్నిహిత శిష్యుడిగా మారారు.

1960లు, 70లలో అప్పటి ఇరాన్ రాజు (షా) పాలకులకు వ్యతిరేక ప్రసంగాలు చేసినందుకు ఖమేనీ ఆరుసార్లు జైలుకు వెళ్లారు. 1979లో జరిగిన 'ఇస్లామిక్ విప్లవం'లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలోనే ఒక బాంబు దాడిలో ఆయన కుడి చేయి పూర్తిగా పక్షవాతానికి గురైంది. అప్పటి నుంచి ఆయన ఎప్పుడూ ఎడమ చేతిని మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తూ కనిపించేవారు.

ఖమేనీ ప్రస్థానం ఇరాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైనది. ఆయన రెండు ప్రధాన దశల్లో దేశాన్ని నడిపించారు. అధ్యక్షుడిగా (1981 - 1989)ఇరాన్-ఇరాక్ యుద్ధం జరుగుతున్న క్లిష్ట సమయంలో ఆయన దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. సైన్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు.

అధ్యక్షుడి కంటే సుప్రీం లీడర్‌కే ఎక్కువ పవర్స్

1989లో విప్లవ నేత అయతుల్లా ఖొమేనీ మరణించిన తర్వాత, అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి కంటే సుప్రీం లీడర్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. సైన్యం, రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచేవి. అగ్రరాజ్యం అమెరికాను మహా సాతాను అని పిలుస్తూ, పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్‌ను నిలబెట్టారు. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇరాన్ అణు సామర్థ్యాన్ని పెంచడంలో ఆయన మొండిగా ముందుకు వెళ్లారు.

ఖమేనీ దాదాపు 35 ఏళ్ల పాటు ఇరాన్‌ను తిరుగులేని నాయకుడిగా పాలించారు. మధ్యప్రాచ్యంలో లెబనాన్, యెమెన్,  సిరియా వంటి దేశాల్లో సాయుధ బృందాలకు మద్దతు ఇస్తూ ఇరాన్ ప్రభావాన్ని పెంచారు. దేశం లోపల కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేయడంలో ఆయన వెనకడుగు వేయలేదు. అయితే, ఆర్థిక ఆంక్షలు మరియు హిజాబ్ వ్యతిరేక నిరసనల వంటి సవాళ్లను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది.

తాజాగా అమెరికా దాడుల్లో ఖమేనీ మరణించడం ఇరాన్ చరిత్రలో ఒక భారీ శకానికి ముగింపు పలికినట్లయింది. ఆయన మరణం తర్వాత ఇరాన్ నాయకత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
 

Advertisment
తాజా కథనాలు