Iran Protests: దేశం విడిచి పారిపోనున్న ఖమేనీ.. ఇరాన్ ఎంబసీ క్లారిటీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దేశం విడిచి వెళ్ళిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలు అవాస్తవాలని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

New Update
Iran Embassy Dismisses

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దేశం విడిచి వెళ్ళిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వార్తలు అవాస్తవాలని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌లో గత కొన్ని రోజులుగా అల్లర్లు చెలరేగుతున్నాయి.  ఆర్థిక సంక్షోభం, కరెన్సీ విలువ పడిపోవడం, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలు క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలుగా మారాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఫ్యామిలీతో కలిసి దేశం విడిచి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. నిరసనకారులు సుప్రీం లీడర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, భద్రతా దళాలతో ఘర్షణలకు దిగడంతో ఈ పుకార్లు మరింత ఊపందుకున్నాయి.

ఈ వార్తలను ఇరాన్ ఎంబసీ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ నాయకత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి పాశ్చాత్య దేశాలు, శత్రు మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించింది. ఖమేనీ దేశంలోనే ఉన్నారని, నిరంతరం ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని ఎంబసీ ఆఫీస్ తెలిపింది. 

ప్రస్తుతం టెహ్రాన్, మషద్, ఇస్ఫహాన్ వంటి ప్రధాన నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ కరెన్సీ పతనం కావడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నిరసనకారులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటికే పలువురు మరణించినట్లు సమాచారం. ఇరాన్ ప్రభుత్వం ఈ నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తోంది. సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారని మరియు ఆయన దేశం విడిచి వెళ్లే ప్రసక్తే లేదని దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ, అంతర్గత పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు