India : చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత్ రెండు స్వర్ణ పతకాలు సాధించింది. ముందుగా పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మహిళా టీమ్ కూడా తన అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవశం చేసుకుంది. పురుషుల జట్టుకు సంబంధించి స్లోవేనియాతో జరిగిన చివరి 11వ రౌండ్‌లో అర్జున్ ఇరిగేశీ, డి.గుకేశ్, ప్రజ్ఞానందలు తమ తమ మ్యాచ్‌లు గెలుపొందారు. జాన్ సుబెల్జ్‌ను అర్జున్ ఇరిగేశి ఓడించగా.. ఫేదోసీవ్‌పై డి.గుకేశ్, అంటన్ డెమ్చెంకోపై ప్రజ్ఞానంద విజయం సాధించారు.
Also Read: అతనొక్కడే.. బంగ్లాతో టెస్టులో రికార్డులు బద్ధలు కొట్టిన లోకల్ బాయ్!
స్లోవినియాతో జరిగిన చివరి రౌండ్ పోటీల్లో ముందుగా అర్జున్ ఇరిగేశి తొలి విజయం సాధించాడు. ఆ తర్వాత డి. గుకేశ్, ప్రజ్ఞానంద వరుసగా గెలిచి భారత్‌కు స్వర్ణ పతకం అందించారు. మరో విషయం ఏంటంటే ఈ ఎడిషన్‌లో భారత్ ఒక్క రౌండ్‌లో కూడా ఓడిపోలేదు. మొదటి నుంచి 8 రౌండ్ల పాటు వరుసగా విజయాలు సాధించింది. తొమ్మిదో రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఉజ్బెకిస్థాన్‌తో మ్యాచ్ డ్రా అయ్యింది. ఆ తర్వాత
పదో రౌండ్‌లో 2.5-1.5తో అమెరికాను ఓడించింది. 11వ రౌండ్‌లో స్లోవేనియాను ఓడించి విజయం సాధించింది.
మరోవైపు మహిళా జట్టు అజర్‌బైజాన్ దేశంపై గెలిచి స్వర్ణం గెలుచుకుంది. మహిళా టీమ్‌లో హారిక ద్రోణవల్లి, వైశాలి రమేష్‌బాబు, దివ్య దేశ్‌ముఖ్, వంటికా అగర్వాల్, తానియా సచ్‌దేవ్, అభిజిత్ కుంటే (కెప్టెన్) అద్భుత ప్రదర్శనతో చరిత్ర లిఖించారు. 97 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో భారత్ బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. అందులోను ఈసారి పురుషులు, మహిళల జట్టులో కూడా స్వర్ణ సాధించడం మరో విశేషం. మరోవైపు భారత్ ఒకేసారి రెండు బంగారు పతకాలు సాధించడంతో సోషల్ మీడియాలో మహిళా, పురుషుల జట్లను ప్రశంసిస్తూ నెటీజన్లు పోస్టులు పెడుతున్నారు. విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా టీం సభ్యులను కొనియాడుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Also Read : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...వారందరికీ పింఛన్లు కట్!