/rtv/media/media_files/2025/09/20/rahul-gandhi-2025-09-20-19-04-41.jpg)
డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా విధానంలో తీసుకున్న కఠినమైన చర్యల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోదీని బలహీనమైన ప్రధాని గా అభివర్ణించారు.అమెరికా H-1B వీసా రుసుమును $100,000 కు పెంచిన వెంటనే రాహుల్ గాంధీ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. "మళ్ళీ చెప్తున్నా, భారతదేశానికి బలహీనమైన ప్రధానమంత్రి ఉన్నారు" అని పేర్కొన్నారు. 2017లో కూడా ఇదే విషయాన్ని హెచ్-1బీ సమస్యపై ట్రంప్‌తో చర్చించడంలో మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. దీని ద్వారా విదేశీ వ్యవహారాల విషయంలో మోదీ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకపోతోందని కాంగ్రెస్ వాదిస్తోంది.
I repeat, India has a weak PM. https://t.co/N0EuIxQ1XGpic.twitter.com/AEu6QzPfYH
— Rahul Gandhi (@RahulGandhi) September 20, 2025
కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా, మనీష్ తివారీ కూడా ఈ విషయంపై స్పందించారు. కేవలం కౌగిలింతలు, కచేరీలు విదేశాంగ విధానం కాదని, జాతీయ ప్రయోజనాలను కాపాడటమే అసలైన విదేశాంగ విధానం అని ఎద్దేవా చేశారు. ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై వ్యూహాత్మకంగా దాడి చేస్తోందని, కానీ భారత ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉందని మనీష్ తివారీ ఆరోపించారు.
పవన్ ఖేరా మాట్లాడుతూ.. 2017లో కూడా రాహుల్ గాంధీ ఇదే విధమైన కుట్ర జరుగుతుందని హెచ్చరించారని, కానీ మోదీ ప్రభుత్వం ఆ హెచ్చరికలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ సమస్య కొత్తది కాదని, మోదీ పాలనలో విదేశీ సంబంధాలలో భారతదేశం బలహీనంగా మారిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.
భవిష్యత్తు ప్రమాదంలో
H-1B వీసా నిబంధనలు కఠినతరం చేయడం వల్ల భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, లక్షల మంది భారతీయ టెకీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నా, భారత ప్రభుత్వం తమ పౌరుల ప్రయోజనాలను కాపాడటంలో విఫలమైందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.