G7 Emergency Meeting : ఇరాన్ క్షిపణి దాడి తరువాత ఇజ్రాయెల్ తన ప్రతీకారం తప్పక తీర్చుకుంటుందనే భయం రోజురోజుకి పెరిగిపోతుంది. కాగా, మధ్యప్రాచ్యంలో రోజురోజుకి పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఛైర్‌పర్సన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జీ7 దేశాల నేతలతో ఫోన్ కాల్‌లో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి తర్వాత ఇరాన్‌పై కొత్త ఆంక్షలు కూడా చర్చించడం జరిగింది. జీ-7 దేశాలు ఏకకాలంలో ఇరాన్‌పై ఆంక్షలు ప్రకటించనున్నట్లు సమాచారం. వైట్ హౌస్ ప్రకటనలో ఇలా పేర్కొంది.... “బైడెన్, జీ7 ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని నిస్సందేహంగా ఖండించాయి. అధ్యక్షుడు బైడెన్ కూడా ఇజ్రాయెల్, ఆ దేశ ప్రజలకు యునైటెడ్ స్టేట్స్ పూర్తి సంఘీభావం, మద్దతును ఉంటుందని ప్రకటించారు.
అమెరికా బలమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఒక రోజు ముందు, బైడెన్ ఇజ్రాయెల్ వైపు వెళ్లే క్షిపణులను కూల్చివేయాలని యూఎస్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం, ఇజ్రాయెల్‌ను రక్షించడానికి మధ్యప్రాచ్యంలో సుమారు 1 లక్ష మంది అమెరికన్ సైనికులు, రెండు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు,వందలాది ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు మోహరించడం జరిగిందని” వైట్ హౌస్ ప్రకటించింది.
అణు కేంద్రంపై దాడి చేయొద్దు..
ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి తాను మద్దతివ్వబోనని జీ-7 సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని బైడెన్ అన్నారు. “ఇజ్రాయెల్‌లు ఏమి చేయబోతున్నారో మేము వారితో చర్చిస్తాము” అని అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ చెప్పారు.
అమెరికా ఆంక్షలు
ఈ దాడికి సంబంధించి ఇరాన్‌పై అమెరికా కూడా కొత్త ఆంక్షలు విధిస్తుందని బైడెన్ అన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ బుధవారం మాట్లాడుతూ.. ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటుందని, దీనిని నిర్ధారించడానికి ఇజ్రాయెల్‌తో కలిసి పని చేస్తుందని చెప్పారు.
Also Read: దిగొచ్చిన కొండా సురేఖ...సామ్ కి క్షమాపణలు!