/rtv/media/media_files/2026/01/03/fotojet-64-2026-01-03-10-38-45.jpg)
Civil war once again...Tensions between Saudi Arabia and the UAE
Saudi Arabia vs UAE : పశ్చిమాసియాలో రెండు శక్తిమంతమైన దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. యెమెన్‌లో తాజా ఘర్షణలే దీనికి కారణం. యెమెన్ లో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలు చెరోవర్గానికి మద్ధతునివ్వడంతో రెండు రాజ్యాల మధ్య అంతర్యద్ధానికి దారితీస్తోంది. ఒకపుడు కలిసి నడిచిన రెండు దేశాలు ఇలా ఘర్షణకు దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
ఘర్షణలకు కారణాలివే..
2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో కీలక సనా నగరాన్ని హూతీ తిరుగుబాటుదారులు ఆక్రమించడమే కాకుండా.. దేశంలోని ఉత్తర భాగాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఇక దక్షిణ, తూర్పు యెమెన్‌లను అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వం (ఐఆర్‌జీ) పాలిస్తోంది. ఆ పాలక మండలిలో కీలక భాగస్వామి అయిన సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్(ఎస్టీసీ) స్వతంత్ర దక్షిణ యెమెన్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ముందుకు కదలడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డిసెంబరు నుంచి ఎస్టీసీ కీలక ప్రాంతాలను ఆక్రమించడం మొదలుపెట్టింది. ఆ నెల రెండో వారంలోనే హద్రమౌత్, అల్-మరాహ్ సహా పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. ఇంధన వనరులు అధికంగా ఉన్న ఈ భూభాగాలను ఆక్రమించడంతో ఒక్కసారిగా యెమెన్‌లో అలజడి చెలరేగింది.
రెండుదేశాలు చెరో వైపు..
ఇక్కడే అసలు వైరం ప్రారంభమైంది. యెమెన్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతిస్తుండగా, దక్షిణ యెమెన్‌ను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఎస్టీసీకి యూఏఈ అండగా నిలబటడం రెండు దేశాల మధ్య ఘర్షణలకు కారణమైంది. వాస్తవానికి హూతీలకు వ్యతిరేకంగా ఉన్న గ్రూపులన్నింటిని ఏకం చేసింది సౌదీ, యూఏఈలే కావడం గమనార్హం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎస్టీసీకి యూఏఈ అండగా నిలిచింది. మరోవైపు యెమెన్ సమైక్యంగా ఉండాలన్నది సౌదీ ఉద్దేశం. ఎస్టీసీ దాడులతో హూతీలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం బలహీనమవుతుందని చెబుతోంది. పైగా తమ దేశ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఎస్టీసీ ఆక్రమించడం.. తమ దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా ఆ దేశం భావిస్తోంది. అందుకే తూర్పు భూభాగాల నుంచి వైదొలగాలని గత నెల 25న ఎస్టీసీకి హెచ్చరించింది. దీన్ని ఆ సంస్థ పట్టించుకోకపోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉండగా యూఏఈ ఎస్టీసీకి ఆర్థిక సాయంతో పాటు ఆయుధ సాయమూ చేస్తోందన్నది సౌదీ అరేబియా ఆరోపణ. అందులో భాగంగానే ఓ నౌక ఆయుధాలతో యూఏఈ నుంచి బయల్దేరి యెమెన్‌లో ముకల్లా ఓడరేవుకు చేరుకుందని ఆరోపిస్తూ గత నెల 28న భారీస్థాయిలో తమ యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. ముకల్లాపై వైమానిక దాడులు చేసింది. తర్వాత సౌదీ మద్దతుతో యెమెన్ ఓ కీలక ప్రకటన చేసింది. తమ దేశంలో ఉన్న సైనికులను యూఏఈ 24 గంటల్లో ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా సౌదీ, యూఈఏల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ముకల్లా రేవుపై దాడులతోనే సౌదీ ఆగిపోలేదు. మళ్లీ శుక్రవారం భారీస్థాయిలో హద్రమౌత్‌పై విరుచుకుపడింది. వైమానిక దాడులు నిర్వహించింది. సౌదీ మద్దతుగా ఉన్న నేషనల్ షీల్డ్ ఫోర్సెస్ కూడా క్షేత్రస్థాయిలో ఎస్టీసీ దళాలతో పోరాడుతుండటం గమనార్హం. ఈ దాడులను తిప్పికొడుతున్నామని ఎస్టీసీ చెబుతోంది. మొత్తానికి మళ్లీ యెమెన్‌లో అంతర్యుద్ధం ప్రారంభమవుతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి.
Follow Us