ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ఎట్టకేలకు దాయదీ దేశానికి ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది. 7 బిలియన్ల డాలర్లు లోన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. తమ దేశంలో లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ఆదివారం ప్రకటన చేసింది. అలాగే ఆరు మంత్రిత్వ శాఖలను కూడా రద్దు చేయనుంది. మరో రెండు శాఖలను విలీనం చేయనుంది.
ఇదే చివరిది
సెప్టెంబర్ 26న ఐఎమ్‌ఎఫ్ పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించింది. పాలనా ఖర్చులను తగ్గించడం, ట్యాక్స్ టూ జీడీపీ నిష్పత్తిని పెంచడం, వ్యవసాయం, రియల్‌ఎస్టేట్ వంటి రంగాలపై ట్యాక్స్ విధించడం, సబ్సిడీలను పరిమితం చేయడం, ప్రావీన్సులకు పలు ఆర్థిక బాధ్యతలను బదిలీ చేయడం లాంటి నిర్ణయాలకు పాకిస్థాన్ కట్టుబడి ఉంది. ఈ పరిణామం అనంతరం ఐఎమ్‌ఎఫ్ మొదటి విడుతగా ఒక బిలియన్ డాలర్లను విడుదల చేసింది. అమెరికా నుంచి తిరిగివచ్చిన తర్వాత పాక్ ఆర్థిక శాఖ మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ మీడియాతో మాట్లాడారు. ఐఎమ్‌ఎఫ్‌తో ఒప్పందం ఖరారైందని తెలిపారు. ఇదే చివరి లోన్ అని చెప్పారు. అంతేకాదు ఇదే చివరి లోన్ అని చాటిచెప్పేందుకు మన విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. G-20లో చేరేందుకు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.
పన్నుదారులు పెరిగారు
ఆరు మంత్రిత్వ శాఖలను రద్దు చేయనున్నామని.. మరో రెండు మంత్రిత్వ శాఖలు విలీనం చేస్తామని తెలిపారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖల కింద ఉన్న ఒక లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను తొలగిస్తామని వెల్లడించారు. అలాగే ట్యాక్స్ రెవెన్యూను కూడా పెంచుతామన్నారు. గత ఏడాది 3 లక్షల మంది కొత్త పన్నుదారులు నమోదయ్యారని.. ఈ ఏడాది ఇప్పటివరకు 7 లక్షల 32 వేల మంది రిజిస్టర్ అయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే పన్నుదారుల సంఖ్య 16 లక్షల నుంచి 32 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. అలాగే పన్ను చెల్లించలేని వారు ఇక స్థలాలను, వాహనాలను కొనలేరని పేర్కొన్నారు. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే వెళ్తోందని.. దేశ విదేశీ మారక నిల్వలు కూడా పెరిగాయన్నారు. జాతీయ ఎగుమతులు, ఐటీ ఎగుమతుల్లో కూడా గణనీయంగా పెరుగుదల నమోదైందని చెప్పారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలసీ రేటును 4.5 శాతం తగ్గించిందని.. అలాగే ఎక్స్‌ఛెంజ్ రేట్, పాలసీ రేట్ ఆశించిన విధంగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల ద్రవ్యోల్బణం కూడా సింగిల్ డిజిట్‌లోకి తగ్గిందన్నారు. ఇదిలాఉండగా.. గత కొన్నేళ్ల నుంచి పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. 2023లో దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. చివరికి ఐఎమ్‌ఎఫ్ 3 బిలియన్ డాలర్ల లోన్ మంజూరు చేయడంతో దివాల ఊబిలోకి పడకుండా పాకిస్థాన్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. పాకిస్తాన్ ప్రపంచ రుణదాత(IMF) తో దీర్ఘకాలిక రుణం కోసం చర్చలు జరిపింది. ఇప్పుడు ఇదే చివరి రుణం అనే నిబద్ధతో ఉంది. అయినప్పటికీ ఇప్పటికే చాలాసార్లు రుణం తీసుకోవడం, ఆర్థిక వ్యవస్థను గాఢిలో పెట్టడం విఫలం కావడం వల్ల ఇది చివరి లోన్ అని చెప్పడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు నిపుణులు అంటున్నారు.