/rtv/media/media_files/2025/12/30/bangladesh-2025-12-30-19-28-23.jpg)
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా మైమెన్‌సింగ్ జిల్లాలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో హిందూ కార్మికుడిపై అతని అదే కంపెనీలోని మరో వ్యక్తి జరిపిన కాల్పుల్లో మృతి చెందడం తీవ్ర సంచలనం రేపింది. గత రెండు వారాల వ్యవధిలోనే హిందూ వ్యక్తులు హత్యకు గురైన మూడవ ఘటన ఇది. సోమవారం సాయంత్రం 6:45 గంటల ప్రాంతంలో మైమెన్‌సింగ్‌లోని భలుకా మండలంలోని 'సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్' ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు బజేంద్ర బిస్వాస్ (42). ఈయన ఫ్యాక్టరీలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నారు. నిందితుడు నోమన్ మియా(29). ఈయన కూడా అదే ఫ్యాక్టరీలో సహోద్యోగిగా పనిచేస్తున్నాడు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, డ్యూటీలో ఉన్న సమయంలో నోమన్ మియా తన వద్ద ఉన్న సర్కారీ తుపాకీని బజేంద్ర వైపు గురిపెట్టి కాల్పులు జరిపాడు. బుల్లెట్ బజేంద్ర ఎడమ తొడలోకి దూసుకెళ్లడంతో ఆయన తీవ్ర రక్తస్రావమై మరణించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రెండు వారాల్లో మూడవ హత్య
బంగ్లాదేశ్‌లో గత 14 రోజుల్లో హిందువులపై జరిగిన మూడవ అతిపెద్ద హింసాత్మక ఘటన ఇది. డిసెంబర్ 18న ఇదే భలుకా ప్రాంతంలో 27 ఏళ్ల దీపు చంద్ర దాస్‌ను మతాన్ని దూషించాడనే ఆరోపణలతో అల్లరి మూకలు దారుణంగా కొట్టి, నిప్పంటించి చంపాయి. రాజ్‌బరి జిల్లాలో అమృత్ మండల్ అనే వ్యక్తిని కూడా అల్లరి మూకలు దాడి చేసి హతమార్చాయి. అయితే, ఇది నేరపూరిత కక్షల వల్ల జరిగిందని ప్రభుత్వం పేర్కొంది. తాజా కాల్పుల ఘటనతో హిందూ మైనారిటీల్లో భయాందోళనలు మరింత పెరిగాయి.
అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన
ఈ వరుస హత్యలపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందిస్తోంది. భారతీయ అమెరికన్ ఎంపీ రో ఖన్నా ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. "ద్వేషపూరిత చర్యలను ప్రపంచ దేశాలు ఏకమై అడ్డుకోవాలి" అని ఆయన పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతపై యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత తాత్కాలిక ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో దాడులు ఆగకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Follow Us