అమెరికాలో పైచదువుల కోసం వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి మజాహిర్ హోటల్ నుంచి ఇంటికెళ్తుండగా.. ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అతని కళ్లు, తల, ముక్కుపై గాయాలయ్యాయి. రక్తంతో తడిసిన మజాహిర్ తనపై జరిగిన దాడిని వీడియోలో వెల్లడించాడు. తనకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని, అలాగే అమెరికాలో ఉన్న ఇండియన్ ఎంబసీని అతడు అభ్యర్థించారు.
Also Read: ఇకనుంచి ఇరాన్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు.. కానీ
సరైన చికిత్స అందించండి
మజాహిర్ పరిస్థితిపై హైదరాబాద్‌లో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన భర్తకు సాయం చేయాలని అతని భార్య ఫాతిమా రిజ్వి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. నా భర్తపై దాడి జరిగినట్లు అతని స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడని.. ఆయన భద్రతపై మాకు ఆందోళనగా ఉందని లేఖలో చెప్పారు. దయచేసి ఆయనకు సరైన చికిత్స అందిలా చూడాలని.. వీలైతే నన్ను అమెరికా వెళ్లేందుకు అనుమతించడి అంటూ కోరారు.
సాయం చేస్తాం
అయితే ఈ అంశంపై అమెరికా చికాగోలోని భారత కాన్సులేట్ స్పందించింది. బాధిత విద్యార్థి మజాహిర్ అలీ, ఆయన భార్య ఫాతిమాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని పేర్కొంది. వాళ్లకి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్న స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించినట్లు తెలిపింది. హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌లో హషీమ్‌నగర్‌కు చెందిన మజాహిర్ అలీ కొద్ది నెలల క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.
Also read: కేసీఆర్ అవినీతిని గ్రామగ్రామాన చాటిచెప్పండి.. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం పిలుపు
ఇదిలాఉండగా.. ఈమధ్య కాలంలో అమెరికాలో వరుసగా భారతీయ విద్యార్థులపై దాడులు జరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. హత్య, అలాగే ఇతరాత్ర కారణాల వల్ల ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన రేపుతోంది.