ఆసియా కప్ 2023లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్లు రాణించారు. బంగ్లాదేశ్ బ్యాటర్లు తౌహీద్ హృదోయ్(81), కెప్టెన్ షాకీబుల్ హసన్ (80) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. మొదట టాస్ గెటిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్‌కు మొదట్లోనే భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. బంగ్లా స్కోర్ 28 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన తౌహీద్ హృదోయ్, కెప్టెన్ షకీబుల్ హసన్ భారత బౌలర్లుపై విరుచుకుపడ్డారు.
ప్రతీ బాల్‌ను బౌండరీకి తరలించాలనే కసితో ఆడారు. అనంతరం నసుమ్ అహ్మద్ సైతం ధాటిగా ఆడటంతో బంగ్లా నిర్ణిత ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 265 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా.. మహ్మద్ షమి 2 వికెట్లు, స్పిన్నర్ రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 4 ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చుకున్నాడు.
అనంరతం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరుగగా.. తిలక్ వర్మ కేవలం 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్(15), శుభ్‌మన్‌గిల్(36) క్రీజులో ఉన్నారు. కాగా ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న భారత్.. నామమాత్రపు మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, భారత కీలక బౌలర్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చారు. వీరి స్థానంలో శార్దూల్ ఠాకూర్, తిలక్ వర్మ, మహ్మద్ షమి, ప్రసిద్ కృష్ణ, టీమిండియా స్కై సూర్య కుమార్ యాదవ్ జట్టులోకి వచ్చారు.